కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న కేటీఆర్. చిత్రంలో జీవన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కమలాకర్ తదితరులు
కాళేశ్వరం పంప్‌హౌస్‌లు ప్రారంభించకపోతే కన్నెపల్లి ముట్టడి
60 వేల మంది రైతులతో గేట్లు తెరుస్తాం..
ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం
కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన..ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, వరంగల్: కేసీఆర్‌పై రాజకీయ కక్షతో తెలంగాణ రైతులను ఈ ప్రభుత్వం గోస పెడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. తెలంగాణకు వరప్రదాయిని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. ఓ వైపు ఎల్‌నినోతో 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొంటే.. మరోవైపు 98 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తుంటే ముఖ్యమంత్రి సిగ్గులేకుండా.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటిౖకైనా పంప్‌హౌస్‌లు ప్రారంభించకపోతే 60 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్‌హౌస్ ముట్టడించి గేట్లు తెరుస్తామని హెచ్చరించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం రైతుల ఆత్మహత్యలు ఆపింది..
‘రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కన్నెపల్లి పంప్‌హౌస్‌లను నిలిపివేశారు. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి మేలు జరిగింది. రైతు ఆత్మహత్యలను ఆపింది. భూముల విలువ, తెలంగాణ రైతు విలువ పెంచింది. కానీ ముఖ్యమంత్రి దు్రష్పచారం చేస్తున్నారు. ప్రాజెక్టు రూ.94 వేల కోట్లు అయితే, రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందంటూ స్వయానా ముఖ్యమంత్రి మామే అన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డైలాగులు చెప్పారు. 2014 కంటే ముందు మీరే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. 2014 కంటే ముందు రికార్డు స్థాయిలో పంటలు ఎందుకు పండలేదు? ఉత్తమ్‌కుమార్.. మీ శ్రీమతి ప్రాతినిథ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో కాకతీయ కెనాల్‌లో ఎప్పుడైనా నీళ్లు ఉన్నాయా?..’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
నీళ్లిస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందనే..
‘కాళేశ్వరం ద్వారా ఇప్పుడు నీళ్లిస్తే యూరియా ఇవ్వాలన్న భయంతోనే రేవంత్ ఇలా చేస్తున్నారు. అంతేకాదు నీళ్లిస్తే పంటలు పండుతాయి. పంట పండితే బోనస్ అడుగుతారు. ఆ పంట మళ్ళీ కొనాలి. కాబట్టే నీళ్లు ఇవ్వడం లేదు. బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు. కాళేశ్వరం రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన ఒక అద్భుత వరం. రాష్ట్రానికి పట్టిన శని రేవంత్‌రెడ్డి అని జగిత్యాల సభలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చెప్పారు. ఒక వారం పాటు కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పజెప్పండి. మొత్తం తెలంగాణ నిండా నీటిని పారించే బాధ్యత మాది. కన్నెపల్లి నుంచి రోజుకు దాదాపు రెండు టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ట్యాంక్‌బండ్ కెపాసిటీ ఒక టీఎంసీ, హుస్సేన్‌సాగర్ కెపాసిటీ ఒక టీఎంసీ. రెండు హుస్సేన్‌సాగర్‌లను లిఫ్ట్ చేసే కెపాసిటీ కాళేశ్వరం మోటార్లకు ఉంది..’ అని కేటీఆర్ చెప్పారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం
‘హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి నాలుగు గంటల్లో చేరాల్సిన మా బృందం, పోలీసులు విధించిన ఆంక్షల కారణంగా ఏడు గంటలు ప్రయాణించాల్సి వచ్చింది. పెంబర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ తదితర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు..’ అని కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీలు మలోత్ కవిత, వినోద్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, విద్యాసాగర్‌రావు, జీవన్‌రెడ్డి, రాజయ్య, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, సుంకె రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


