
కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఎండిన పంటల పరిశీలన
ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసే అవకాశం
పార్టీ మారేది లేదని స్పష్టం చేసిన మాజీ మంత్రి గంగుల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్ ముందుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌కు తిరుగుపయనమవుతారు. కాగా, ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ మైండ్ గేమ్: మాజీ మంత్రి గంగుల
బీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతానంటున్న ప్రచారం ఊహజనితమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తేల్చిచెప్పారు. కరీంనగర్‌లో ఆయన గురువారం పార్టీ మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. తాను కారు దిగే ప్రసక్తే లేదని, తనను బద్నాం చేసేందుకే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో తనపై దు్రష్పచారం చేస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని దీమా వ్యక్తం చేశారు.