రాజేంద్రనగర్‌, చేవేళ్లకు త్వరలో ఉప ఎన్నికలు: కేటీఆర్‌ | BRS KTR Sensational Comments By Elections In Telangana | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్‌, చేవేళ్లకు త్వరలో ఉప ఎన్నికలు: కేటీఆర్‌

Apr 20 2025 12:30 PM | Updated on Apr 20 2025 1:12 PM

BRS KTR Sensational Comments By Elections In Telangana

సాక్షి, తెలంగాణ భవన్:  తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది? నిట్టనిలువునా మోసపోయామని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అలాగే, తెలంగాణలోని రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. బీసీ, ఎస్సీ, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తాజాగా తెలంగాణ భవన్‌కు వచ్చారు. రాజేంద్రనగర్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి కేటీఆర్‌ ఆహ్వానించారు. అనంతరం, కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సంవత్సరమే ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ అక్కడ బీఆర్‌ఎస్‌ గెలవాలి. తెలంగాణలో ఉప ఎన్నికలు రావు అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మరుసటి రోజు లైన్ దాటితే తాట తీస్తామని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సుప్రీంకోర్టు ఊరుకుంటుందా?.

కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ గుండెలు జారేలా బీఆర్‌ఎస్‌ శ్రేణులు వరంగల్ సభకు కదలాలి. వరంగల్‌లో 1250 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. వరంగల్‌ సభలో కేసీఆర్‌ ఒక్కరే మాట్లాడతారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజలను మోసం చేసింది. బీసీ, ఎస్సీ, యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?’ అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement