సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాగంటి సునీత కుటుంబ వ్యవహారం శేరిలింగంపల్లి తహసీల్దార్ ఆఫీసుకు చేరింది. మాగంటి గోపీనాథ్ రెండో భార్య సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను శేరిలింగం పల్లి తహసీల్దార్ జారీ చేశారు.
మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను జారీ చేయడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారని మొదటి భార్య మాలినీ దేవి,ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై తహసీల్దార్ విచారణ చేపట్టారు.
ఇందులో భాగంగా శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మాగంటి గోపినాథ్ కుటుంబ సభ్యులు వచ్చారు. తనకు ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్‌పై తలెత్తుతున్న అభ్యంతరాలపై వివరణ ఇచ్చేందుకు మాగంటి సునీత తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత.. ఆయన సతీమణి మాగంటి సునీతను ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్‌ఎస్ బరిలోకి దించింది. అయితే ఆమె ఎంపిక మాంగటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాగంటి సునీత నామినేషన్లను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తారక్ ప్రద్యుమ్న ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. కుటుంబ సమస్య కాబట్టి న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ క్రమంలో మాగంటి సునీతకు తహసీల్దార్ ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేయడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య,ఆమె కుమారుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉత్కంఠగా మారింది.
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అంటే?
ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సమయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. ఎందుకంటే అది అభ్యర్థి కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా ధృవీకరించే పత్రం. ఇది వారసత్వ సంబంధాలు, కుటుంబ స్థితి, నామినేషన్ అఫిడవిట్‌లో ఇచ్చే సమాచారం సరైనదేనా అన్నది నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది.


