లీక్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు.. బీజేపీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిర్ణయం

BJP Task Force Committee decision to demand KTR dismissed - Sakshi

ఐటీ మంత్రి కేటీఆర్‌ బర్తరఫ్, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై శనివారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. తొలుత శుక్రవారమే కలిసి వినతిపత్రం సమర్పించాలని భావించినా, గవర్నర్‌ అందుబాటులో ఉండటం లేదన్న సమాచారంతో కార్యక్రమాన్ని 18వ తేదీకి మార్చారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు శుక్రవారం నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రశ్నపత్రాల లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని పార్టీ అభిప్రాయపడింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. లీకేజీ వ్యవహారంపై బీజేపీ నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ గురువారం రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ అధ్యక్షతన సమావేశమమైంది.

టీఎస్‌పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలని, కమిషన్‌ చైర్మన్‌ సహా సభ్యులందరినీ తొలగించాలని కమిటీ డిమాండ్‌ చేసింది. గ్రూప్‌–1, ఏఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకైనట్లు ప్రాథమికంగా అంచనా వేసిన కమిటీ.. మిగిలిన పేపర్ల లీకేజీ సంబంధిత అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 

ప్రగతి భవన్‌కు లింకులున్నాయా? 
లీకేజీకి సంబంధించిన పలు అంశాలపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చర్చించింది. ప్రశ్నపత్రాలు ఎలా లీక్‌ అయ్యాయి? దీని వెనుక ఎవరున్నారు? చైర్మన్‌పై ఏమైనా ఒత్తిడి ఉందా? కింది స్థాయి సిబ్బందికి నేరుగా ప్రగతి భవన్‌తో లింకులున్నాయా? తదితర అంశాలపై సభ్యులు చర్చించారు.

కాగా కేంద్రం 2011లో చేసిన ఐటీ చట్ట సవరణ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో నడిచే అన్ని శాఖల్లోని ఐటీ విభాగాలు తప్పనిసరిగా కేంద్రం నియమించిన థర్డ్‌ పార్టీ నిర్వహించే సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రభుత్వ శాఖ వెబ్‌సైట్‌కూ ఆడిట్‌ సర్టిఫికెట్‌ లేదనే విషయం పలువురు సభ్యులు ప్రస్తావించారు.  

నష్టపోయే విద్యార్థులకు పరిహారంపై ఒత్తిడి 
పరీక్షల రద్దుతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్న నేపథ్యంలో వారందరికీ రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కమిటీ నిర్ణయించింది. అయితే గత షెడ్యూల్‌ మేరకు ఆయా పరీక్షలన్నీ నిర్వహించి ఉద్యోగ నియామకాలను పూర్తి చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని కూడా తీర్మానించింది.

ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కన్వీనర్‌ సీహెచ్‌.విఠల్, సభ్యులు మర్రి శశిధర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, చంద్రవదన్, టి.క్రిష్ణప్రసాద్, దుగ్యాల ప్రదీప్‌కుమార్, ఎస్‌.కుమార్, కరుణా గోపాల్‌ పాల్గొన్నారు.

అక్రమాలపై న్యాయపోరాటం 
టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీతోపాటు ధరణి స్కాం, జీహెచ్‌ఎంసీ నకిలీ సర్టిఫికెట్ల స్కాం, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ చెల్లింపుల స్కాం సహా ఇరిగేషన్‌ శాఖలో భారీగా కుంభకోణాలు జరుగుతున్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు.

దీనికంతటికీ ఐటీ శాఖ పరిధిలో ఉద్దేశపూర్వకంగా కొనసాగిస్తున్న లోపాలే కారణమని అంచనాకు వచ్చారు. టీఎస్‌పీఎస్సీ అక్రమాలపై విచారణ కోసం న్యాయపోరాటం చేయాలని టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top