సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోందని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేతలపై యాక్షన్ ఎందుకు లేదు? అని ప్రశ్నించారు.
బీజేపీ కార్యాలయంలో కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు జరిగాయి. కర్పూరి ఠాకూర్ జీవితం కార్యకర్తలకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ప్రజలతో ఆటలాడుతున్నాయి. రెండేళ్లుగా దర్యాప్తు పేరుతో డ్రామాను తలపిస్తున్నాయి.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ ఉండాలి. అరెస్టులు చేయాలి. పక్క రాష్ట్రాల్లో ఛార్జ్‌షీట్‌లు, తెలంగాణలో ఎందుకు కాదు?. కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందేమో అనే అనుమానం కలుగుతుంది. బీఆర్‌ఎస్ ఆరోపణలకు విలువ లేదు. అధికారులపై మాత్రమే చర్యలు ఉన్నాయి. నేతలపై యాక్షన్ ఎందుకు లేదు?. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.


