సీట్లు ఎక్కువ కావాలి.. ఒంటరిగానే పోటీ చేస్తాం

BJP To Go it Alone in Tamil Nadu Urban Local Body Polls: Annamalai - Sakshi

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ఉండదు

బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

చెన్నై: తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై సోమవారం ప్రకటించారు. తమిళనాడు వ్యాప్తంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

విలేకరుల సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నందున ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అభ్యర్థుల తొలి జాబితాను త్వరలో విడుదల చేస్తామన్నారు. (చదవండి: చిక్కుల్లో డీఎంకే ఎమ్మెల్యే)

'ఇదేమి కష్టమైన నిర్ణయం కాదు. అన్నాడీఎంకే నేతలు ఓ పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయాన్ని జాతీయ నాయకులు ఆమోదించారు. ఇలాంటి ఎన్నికల్లో సీట్ల పంపకం చాలా కష్టంతో కూడుకున్న పని. మాకు 10 శాతం సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే ముందుకు వచ్చింది కానీ మేం ఎక్కువ శాతం సీట్లు కావాలని అడిగామ’ని అన్నామలై తెలిపారు.

బీజేపీ నిర్ణయంపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి డి జయకుమార్ మాట్లాడుతూ.. కమలం పార్టీ అడిగినన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. సీట్ల పంపకం చర్చలు సామరస్యంగా జరిగినా ఫలప్రదం కాలేదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగుతుందా, లేదా అనేది ఏఐఏడీఎంకే అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.

కాగా.. సేలం, అవడి, తిరుచ్చి, మదురై, శివకాశి, తూత్తుకుడి మునిసిపల్ కార్పొరేషన్‌లతో పాటు పలు మున్సిపాలిటీలకు అన్నాడీఎంకే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. (క్లిక్‌: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top