ఓట్ల వేటలో ఏడు సూత్రాల పథకం 2.0

Bihar Chief Minister Announces A New Seven Point Programme - Sakshi

నితీష్‌ ప్రకటన లాభిస్తుందా!

పట్నా : రాజకీయాల్లో ఏ సమయంలో ఏం చేయాలనేదే కీలకం. ఆ ఒడుపులన్నింటినీ ఒడిసిపట్టడంలో దిట్టగా పేరొందిన బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఎన్నికల సమయంలో భారీ పథకంతో వేడిని రాజేశారు. సెప్టెంబర్‌ 25న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ మూడు విడతల పోల్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన మరుక్షణమే నితీష్‌ ఏడు సూత్రాల కార్యక్రమం -2ను ప్రకటించారు. 2015లో తన విజయానికి దోహదపడిన సాథ్‌ నిశ్చయ్‌ (ఏడు అంశాలు)కు కొనసాగింపుగా ఆయన ఈ ప్రకటన చేశారు. యువతకు ఉపాధి అవకాశాలను సమకూర్చే నైపుణ్య శిక్షణా కార్యక్రమాల నుంచి మహిళలోల​ వ్యాపార దక్షతను పెంచడం, వ్యవసాయ భూములకు సాగునీరు లభ్యత, ప్రజలకు వైద్య సౌకర్యాలు మెరుగపరచడం వంటి పలు అంశాలను ఈ ప్రణాళికలో పొందుపరించారు.

వ్యాపారాలను ప్రారంభించే ఆసక్తి కలిగిన మహిళలకు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దళిత యువతీ, యువకులకూ ఈ తరహా పథకాన్ని నితీష్‌ ఇప్పటికే అమలు చేస్తున్నారు. సాథ్‌ నిశ్చయ్‌ పథకం ప్రశంసలు దక్కించుకోవడమే కాకుండా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌ను విజయతీరాలకు చేర్చింది. అప్పట్లో బీజేపీతో జట్టు కట్టిన రాం విలాస్‌ పాశ్వాన్‌, ఉపేంద్ర కుష్వహ, జితిన్‌ రాం మాంఝీ వంటి హేమాహేమీలను ఎదుర్కొని నితీష్‌ జయకేతనం ఎగురవేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ వంటి పార్టీల సాయంతో నితీష్‌ ఆ ఎన్నికల్లో ఎదురీదుతారన్న అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన సారథ్యంలోని జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమి విజయం సాధించింది. చదవండి : బిహార్‌లో మహాకూటమికి షాక్‌

ప్రతి ఇంటికీ పైపుల ద్వారా తాగునీటి సరఫరా, విద్యుత్‌ కనెక్షన్లు కల్పించడంతో పాటు మరుగుదొడ్లు నిర్మిస్తామని, ప్రతి గ్రామలో రహదారుల నిర్మాణం చేపడతామని ఆ ఎన్నికల్లో  నితీష్‌ వాగ్ధానం చేశారు. ఇప్పుడు ఆ పనులన్నీ దాదాపు పూర్తవుతున్నాయి. ఆ ఊపుతోనే నితీష్‌ వ్యూహాత్మకంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాథ్‌ నిశ్చయ్‌-2ను తెరపైకి తీసుకువచ్చారు. మహాకూటమిని వీడి ఈసారి ఎన్డీయే పక్షాన అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతున్న నితీష్‌ మరోసారి విజయం సాధిస్తే ఆయన రికార్డుస్ధాయిలో ఏడోసారి బిహార్‌ పాలనా పగ్గాలను చేపడతారు. ఇక ఈసీ వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మూడు దశల్లో అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7న జరగనుంది. నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top