దెందులూరు ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌ | Big Twist in Denduluru Episode: TDP Suspend Srinivas Amid Chintamaneni | Sakshi
Sakshi News home page

దెందులూరు ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌

Jun 15 2026 12:16 PM | Updated on Jun 15 2026 12:30 PM

Big Twist in Denduluru Episode: TDP Suspend Srinivas Amid Chintamaneni

సాక్షి, ఏలూరు: దెందులూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ గత అర్ధరాత్రి న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఇంటి వద్ద అనుచరులతో హల్‌చల్‌ చేయడం స్థానికంగా కలకలం రేపింది. అయితే.. ఈ ఘటనలో చింతమనేని అక్రమాల బాగోతాన్ని బయటపెట్టిన లాయర్‌ శ్రీనివాసపైనే టీడీపీ సస్పెన్షన్‌ వేటు వేసింది.

లాయర్‌ ఈడ్పుగంటి శ్రీనివాస్‌ను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో చింతమనేనికి క్లీన్‌ చిట్‌ లభించినట్లయ్యింది. ఇదిలా ఉంటే..  శ్రీనివాసబాబు గతంలో చింతమనేని తరఫున కేసులు వాదించడం గమనార్హం. అయితే ఇద్దరి మధ్య గత కొంతకాలంగా విబేధాలు నడుస్తున్నాయి. చింతమనేని నియోజకవర్గంలో అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారంటూ శ్రీనివాస్‌ పార్టీకి నివేదికలు పంపే ప్రయత్నాలు చేశారు.

ఇది తెలుసుకున్న చింతమనేని.. శ్రీనివాస్‌ తనను, తన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆరోపణలకు దిగారు. గత రాత్రి జేసీబీలతో సహా శ్రీనివాసబాబు ఇంటికి చేరుకుని ఇంటి ముట్టడికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తీవ్ర ఆగ్రహంతో “నన్ను ఆపుతారేంటి?.(పోలీసులను ఉద్దేశించి..).. కూల్చు.. కూల్చు(జేసీబీ డ్రైవర్లను ఉద్దేశించి..). వాడో నేనో తేలాల్సిందే” అంటూ బహిరంగంగా హెచ్చరించారు. ఆ సమయంలో చింతమనేనిని కూడా శ్రీనివాస్‌ గట్టిగా నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు.. నానా హంగామా చేసిన చింతమనేనిని రాచమర్యాదలతో ఇంటికి పంపించారు. మరోవైపు శ్రీనివాసబాబును, ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ తీసుకున్న చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ క్రమశిక్షణ చర్యగా పార్టీ చెబుతున్నప్పటికీ, చింతమనేని అరాచకాలకు మద్దతు పలకడం ఏంటని? కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు.. శ్రీనివాస్‌ భార్య మీడియా ముందుకు వచ్చి జరిగింది చెప్పి వాపోతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న తన భర్త, తన కొడుకును టార్గెట్‌ చేశారని.. పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లిద్దరితో పాటు తనను చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సంచలన ఆరోపణలకు దిగారామె.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement