విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలి

BC Leader Jajula Srinivas Goud Demands CM KCR To Clear Fee Reimbursement Bills - Sakshi

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు వెంటనే విడుదల చేయాలి

ముగిసిన బీసీ విద్యార్థుల పోరు యాత్ర 

కవాడిగూడ (హైదరాబాద్‌): బడుగు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమంకోసం విద్య, వైద్య రంగాలను జాతీయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న సీఎం కేసీఆర్‌ 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

సచివాలయం, రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి భవన్‌లు నిర్మించుకోవడానికి నిధులు ఉంటాయిగానీ, బీసీ విద్యార్థులకు నూతన వసతి భవనాలు నిర్మించడానికి నిధుల కొరత ఉందని చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు. చదువుకోసం, సామాజిక న్యాయసాధన కోసం తలపెట్టిన బీసీ విద్యార్థుల పోరుయాత్ర ముగింపు సభ ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో జరిగింది.

డిసెంబర్‌ 2న పాలమూరులో ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం హైదరాబాద్‌ చేరుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బీసీ విద్యార్థి, యువజనులు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణను జ్ఞాన తెలంగాణ చేయకుండా గొర్రెలు, బర్రెలను పంపిణీ చేస్తూ విద్యను వ్యాపారం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

బడులు మూసి, బార్‌లు తెరుస్తున్న కేసీఆర్‌ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు బకాయిపడ్డ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2023లో ఓటు మనదే.. సీఎం సీటు మన­దే.. అని నినాదమిచ్చారు. ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి బీసీ విద్యార్థుల మొత్తం ఫీజును ప్రభు­త్వమే చెల్లించాలన్నారు.

ప్రైవేటు యూనివర్సి­టీలను రద్దుచేసి ప్రభుత్వ యూనివర్సిటీలను ఏర్పా­టు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలన్నారు. తెలంగాణలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకోసం రాజకీయ విధా­నాన్ని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్‌ కురుమ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top