బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులు కలిసి పనిచేశాయి: బండి సంజయ్‌

Bandi Sanjay Serious Comments On TRS For Munugode Election Win - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ పార్టీ ఓటమిని చవిచూసింది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ.. గెలుపుపై ధీమా వ్యక్తం చేసినప్పటికీ మునుగోడు ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. ఇక, బీజేపీ ఓటమి నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ స్పందించారు. ఓడిపోతే కుంగిపోమని స్పష్టం చేశారు. 

కాగా, బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజా తీర్పును గౌరవిస్తాము. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఈ ఎన్నికల్లో యుద్ధం చేశారు. అధికార పార్టీ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా బీజేపీ కార్యకర్తలు తలొగ్గకుండా పనిచేశారు. గెలిచిన ఆనందంలో టీఆర్‌ఎస్‌ నేతలు హామీలు నెరవేర్చుతామని చెప్పకుండా అహంకారంగా మాట్లాడుతున్నారు. మునుగోడు గెలుపు.. తండ్రి గెలుపా? కొడుకు గెలుపా?. అల్లుడి గెలుపా?. బీజేపీకి భయపడి.. మా పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులు (టీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం, పరోక్షంగా కాంగ్రెస్‌) కలిసి పనిచేశాయి. 

దమ్ముంటే టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మందితో రాజీనామా చేయించండి. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రచారం చేస్తే 10వేల మెజార్టీ వచ్చింది. ఈ గెలుపు.. గెలుపే కాదు. మునుగోడు గెలుపు ఎన్నికల కమిషనర్‌ గెలుపు. టీఆర్‌ఎస్‌ వాళ్లు డబ్బులు పంచారు.. కానీ ఎక్కడా దొరకలేదు. టీఆర్‌ఎస్‌ను అడ్డుకునే దమ్మున్న పార్టీ బీజేపీనే. తెలంగాణ అంతటా బీజేపీ ఉంది. ముందు ముందు మరింత కమిట్‌మెంట్‌తో పనిచేస్తాము. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాము’ అని వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top