మంచి చేస్తే ఆత్మహత్యలెందుకు? 

Bandi Sanjay Serious Comments On CM KCR - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రైతుల పాలిట రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనిలా తయారయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన ఫ్రీ యూరియా, రుణమాఫీ హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణలో 8 ఏళ్లుగా రైతులకు నయా పైసా సాయం చేయని కేసీఆర్‌.. కేంద్రం పైసా ఇవ్వడం లేదని నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.  

శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావులతో కలిసి బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. రైతులకు కేసీఆర్‌ మంచి చేస్తే వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? అని ప్రశ్నించారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు మోపి తిట్టడం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌లకు అలవాటైపోయిందన్నారు. 

పాత లెక్కలు అడుగుతుందనే భయం..
2016–17లో తెలంగాణలో నష్టపోయిన రైతులకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం రూ.916 కోట్లు మంజూరు చేస్తే... అందులో రూ.700 కోట్లు కూడా ఖర్చు చేయకుండా గండి కొట్టి రైతులను మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్‌ అని మండిపడ్డారు. ఇప్పుడు వడగండ్ల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు సాయం అడిగితే, కేంద్రం పాత లెక్కలు అడుగుతుందన్న భయంతో సీఎం కేసీఆర్‌ కేంద్రానికి నివేదికలు పంపట్లేదని సంజయ్‌ ఆరోపించారు.  గురువారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులతోనే రైతులకు సాయం చేస్తున్నట్లు చెప్పారని... మరి ఆ నిధుల్లో 75 శాతం వాటా కేంద్రానిదే అన్న మాట  ఎందుకు చెప్పట్లేదు? అని నిలదీశారు.  

మోదీతో పాటు బీసీలను అవమానించారు.. 
కాగా మోదీ ఇంటిపేరున్న వాళ్లంతా దొంగలేనంటూ రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాకుండా మొత్తం ఓబీసీ సమాజాన్ని అవమానించారని సంజయ్‌ అన్నారు. తక్షణమే రాహుల్‌  ఓబీసీ సమాజానికి, నరేంద్రమోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇందిరాగాంధీ నుంచి  రాహుల్‌ గాంధీ వరకు న్యాయ వ్యవస్థను అగౌరవపరుస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top