Sakshi News home page

ఓటర్లను ప్రలోభపెడుతున్నారు

Published Sun, Nov 14 2021 4:35 AM

Balineni Srinivasa Reddy Perni Nani Anilkumar Yadav Comments On Chandrababu - Sakshi

నెల్లూరు సిటీ/దర్శి: కుప్పంలో కూడా ఘోర పరాజయం తప్పదనే విషయం తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్‌లు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. అనేక ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే ఇప్పుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు శనివారం నెల్లూరు నగరం, ప్రకాశం జిల్లా దర్శిలో వేర్వేరుగా ఎన్నికల ప్రచారం చేశారు. నెల్లూరు, దర్శిలో మంత్రి బాలినేని మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. ఇక రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.

అందుకే ఇప్పుడు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మునిసిపల్‌ ఎన్నికల్లో కూడా ఎదురీదుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు లోకేష్‌ కుప్పంలో గెలిచేందుకు ఓటుకు రూ.5 వేలు చొప్పున పంచే పరిస్థితి వచ్చిందన్నారు. కుప్పాన్ని మునిసిపాలిటీ చేసింది సీఎం వైఎస్‌ జగన్‌ అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కోవిడ్‌ సంక్షోభ సమయంలోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు.

ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దర్శిలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో రుణమాఫీలంటూ ఎడాపెడా హామీలిచ్చి.. ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని హామీలను నెరవేరుస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీలతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, విడదల రజిని, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement