ప్రభుత్వ భూముల్లోనే పరిపాలన రాజధాని

Avanthi Srinivas Comments On Chandrababu And Lokesh - Sakshi

కుంభకోణాలకు ఈ ప్రభుత్వంలో అవకాశం లేదు

టీడీపీ హయాంలో దోచుకున్నవి స్వాధీనం చేసుకుంటున్నాం

చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా విశాఖ ప్రజల భిక్ష

విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటే తగిన శాస్తి తప్పదు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ప్రభుత్వ భూముల్లోనే రాజధాని నిర్మాణం ఉంటుందని, అమరావతి మాదిరిగా ప్రైవేట్‌ భూములు విశాఖ రాజధానికి అవసరం లేదని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విశాఖపట్నంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని, ఆ పార్టీ నేతలు దోచుకున్న విలువైన భూములను తమ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంటే.. భూములు దోచుకుంటున్నారు, ఆక్రమించుకుంటున్నారు.. అని చంద్రబాబు, లోకేశ్‌ గొంతుచించుకోవడం విడ్డురంగా ఉందని చెప్పారు. రెండేళ్ల పాలనలో తాముగానీ, తమ ఎమ్మెల్యేలుగానీ ఒక్క సెంటు భూమి కబ్జా చేసినట్లు తండ్రీకొడుకులు నిరూపించగలిగితే ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్‌ విసిరారు.

విశాఖ ప్రజలు ఓట్లు వేసినందునే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కిందని, అది విశాఖ ప్రజలు పెట్టిన భిక్ష అని చెప్పారు. అలాంటి విశాఖ ప్రాంత అభివృద్ధినే అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఆఫీసులను తనఖా పెడుతున్నారని, విశాఖను అమ్మేస్తున్నారని టీడీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వందల కోట్ల రూపాయల భూకబ్జాలకు పాల్పడిన పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు పార్టీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్నారని, ఇప్పుడు ఆయన్ని పార్టీ నుంచి డిస్మిస్‌ చేస్తారా.. కొనసాగిస్తారా.. అనేది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా విశాఖ భూములను వుడా ద్వారా అమ్మి, ఆ డబ్బులు తీసుకెళ్లి అప్పటి రాజధాని హైదరాబాద్‌లో ఖర్చుపెట్టారని, అప్పుడు టీడీపీ నేతలు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. విశాఖలో ఎన్‌ఏడీ ప్లైఓవర్‌కు గతంలో శంకుస్థాపన మాత్రమే చేస్తే తాము ఈ రెండేళ్లలో పూర్తిచేశామని, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు.

మరో 4ఫ్లైఓవర్‌లకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, ఎనిమిదిలైన్ల రహదారి, మెట్రోరైల్‌.. శంకుస్థాపనలకు సిద్ధమయ్యాయని వివరించారు. బెంగళూరు, చెన్నై, ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. బీజేపీ నాయకులకు నిజంగా విశాఖపై ప్రేమ ఉంటే రైల్వేజోన్, ప్రత్యేక హోదా, మెట్రోరైల్‌ వచ్చే విధంగా చూడాలని, ఈ విషయంపై అధిష్టానాన్ని ప్రశ్నించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, విశాఖ  ఉత్తర నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కె.కె.రాజు, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top