సొంతపిచ్‌పై...అఖిలేశ్‌కు అగ్నిపరీక్ష!

up assembly election 2022: Akhilesh exam in Yadav land In the third phase - Sakshi

ఉత్తరప్రదేశ్‌ మొదటిదశ ఎన్నికల్లో జాట్లు కీలకంగా మారగా.. రెండోదశలో (ఫిబ్రవరి 14న పోలింగ్‌ జరిగింది) ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో పోలింగ్‌ జరిగింది. ఈనెల 20న మూడోదశ పోలింగ్‌ యాదవుల బెల్ట్‌లో జరుగుతోంది. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గ బలమెక్కువ. సమాజ్‌వాది (ఎస్పీ)కి దీన్ని కంచుకోటగా అభివర్ణిస్తారు.

అలాంటి ఈ ప్రాంతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి తలబొప్పి కట్టింది. అఖిలేశ్‌పై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్న బాబాయి శివపాల్‌ సింగ్‌ యాదవ్‌తో ఇటీవలే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకున్నప్పటికీ ఎస్పీ అధినేతకు మూడోదశ విషమపరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కర్హల్‌ నుంచే అఖిలేశ్‌ స్వయంగా బరిలో నిలిచారు.

బాబాయ్‌తో సయోధ్యతో పూర్వవైభవంపై ఆశలు
పశ్చిమ యూపీలోని..ఐదు జిల్లాలు, అవధ్‌ ప్రాంతంలోని ఆరు జిల్లాలు, బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని ఐదు సీట్లకు ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్‌ జరగనుంది. ఫిరోజాబాద్,, కాస్‌గంజ్, ఎతాహ్, మెయిన్‌పురి,, ఫరూకాబాద్,, కన్నౌజ్, ఔరాయా జిల్లాలు 2017లో అఖిలేశ్‌ పార్టీకి ఓటువేయలేదు.ఫలితంగా ఐదేళ్ల కిందట మొత్తం 59 సీట్లలో బీజేపీ ఏకంగా 49 తమ ఖాతాలో వేసేసుకుంది. సమాజ్‌వాది పార్టీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఎస్పీ అధినేత కుటుంబకలహాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ అఖిలేశ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ కన్నౌజ్‌ నుంచి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2012లో ఈ 59 సీట్లలో (20న పోలింగ్‌ జరిగే స్థానాలు) ఎస్పీ 37 చోట్ల నెగ్గడం గమనార్హం.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ బెల్ట్‌లో ఎస్పీ విజయావకావలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అఖిలేశ్‌ తన  శివపాల్‌ యాదవ్‌ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. గతంలో హథ్రాస్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటన కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది.

దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్న ఎస్పీ అధినేత ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రతినెలా ‘హథ్రాస్‌ కి బేటి స్మృతి దివస్‌’ను నిర్వహిస్తున్నారు. బుందేల్‌ఖండ్‌ బాగా వెనుకబడిన ప్రాంతం కావడతో నిరుద్యోగ సమస్య, నీటి ఎద్దటి తదిదర సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్, నెలకు కిలో నెయ్యిని అందిస్తామని అఖిలేశ్‌ ఓటర్లుకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు బుందేల్‌ఖండ్‌ బీఎస్పీకి కంచుకోటగా ఉండేది. కానీ 2017లో వీచిన బీజేపీ గాలితో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది.  
 

హైటెన్షన్‌ పోరు
కర్హాల్‌ నియోజకవర్గంలో అఖిలేశ్‌కు పోటీగా ఓబీసీ నాయకుడు, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్‌ బఘేల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానంలో మొత్తం ఓటర్లలో 38 శాతం మంది యాదవులే. తర్వాతి స్థానంలో క్షత్రియులు ఉంటారు. భోగావ్‌ నియోజకవర్గంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి రామ్‌నరేశ్‌ అగ్నిహోత్రికే బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కాన్పూర్‌ నగర్‌ జిల్లాలోని మహారాజ్‌పూర్‌ నుంచి సతీష్‌ మహానాను బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. తొలిదశ ఎన్నికలు పశ్చిమ యూపీలో జరిగినందువల్ల తమకు అనుకూలత ఉందని భావిస్తున్న అఖిలేశ్‌ యాదవ్‌ మూడోదశలో ఎలాగైనా పైచేయి సాధించాలనే పట్టుదలతో పని చేస్తోంది.దీంట్లో పైచేయి సాధిస్తే మిగతా నాలుగు దశల్లో కొంత ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ఎస్పీ భావిస్తోంది.

యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ కుల, సంకుచిత, నియంతృత్వ పాలనకు ముగింపు పల కండి. సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూసే బహుజన సమాజ్‌ పార్టీకే పట్టంకట్టండి. దోపిడీదారుల అరాచకాలతో గతంలో యూపీ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. మా  పాలనలో వీరందరినీ ఏరిపారేశాం. ఎస్‌పీ పాలనలో రాష్ట్రంలో కేవలం ఒక వర్గం వారే అభివృద్ధి ఫలాలను అందుకున్నారు. మా ప్రభుత్వం వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించింది. మిగతా పార్టీల్లా మేం నెరవేర్చని వాగ్దానాలు చేయబోం. అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదలచేయలేదు.
– బీఎస్‌పీ చీఫ్‌ మాయావతి

అఖిలేశ్‌ గెలుపు ఖాయమని మొదట్లో అతి విశ్వాసంతో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హాల్‌ నియోజకవర్గంలో స్వయంగా ప్రచారం చేయా ల్సిన పనే లేదని, నేరుగా ఫలితాలు వెలువడే రోజు(మార్చి పదో తేదీ)న కర్హాల్‌ వస్తానని అఖిలేశ్‌ ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా ములాయం సింగ్‌తో ముందే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయం సాధించాలని ఓటర్లు ఆకాంక్షిస్తే.. ఈ గెలుపు పరంపర కర్హాల్‌ నుంచే మొదలవ్వాలి.    
    – హోం మంత్రి అమిత్‌ షా         
 
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top