యూపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తాం: అసదుద్దీన్‌

Asaduddin Owaisi Led AIMIM to Contest 100 Seats in UP Assembly Polls - Sakshi

ఎస్‌బీఎస్‌పీతో కలిసి యూపీలో బరిలో దిగనున్న ఎంఐఎం

లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐఎంఐఎం కూడా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. యూపీ ఎన్నికల్లో దాదాపు 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని వెల్లడించింది.

2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. ఇందుకోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పార్టీ ప్రారంభించిందన్నారు. ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ సారథ్యంలోని సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ)తో కలిసి ఎంఐఎం యూపీ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు. భగీదరి సంకల్ప్‌ మోర్చా పేరుతో ఇతర పార్టీలని ఏకం చేస్తున్న ఓం ప్రకాశ్‌ నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అంతేకాక, ఎన్నికలు, పొత్తులపై ఇతర రాజకీయ పార్టీలతో ఇప్పటివరకు చర్చించలేదని అసదుద్దీన్‌ తెలిపారు. ఈ మేరకు అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు.

గతేడాది జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 20స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం, ఐదు స్థానాల్లో గెలుపొందింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్‌ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నించి విజయం సాధించింది. అంతకుముందు 2019లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇలా వివిధ రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోన్న ఎంఐఎం.. వచ్చే ఏడాది జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలపైనా కన్నేసింది. అయితే, ఈ మధ్యే జరిగిన పశ్చిమబెంగాల్‌, తమిళనాడులో మాత్రం ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

చదవండి: ఎంఐఎంతో పొత్తు.. అస్సలు ఉండదు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top