Special Article On Pawan Kalyans Frustrated Comments - Sakshi
Sakshi News home page

పవన్‌.. అప్పుడు ‘తీవ్రవాది’ ఎందుకు బయటకు రాలేదు ?

Published Thu, Jan 26 2023 4:13 PM

Article On Pawan Kalyans Frustrated Comments - Sakshi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లో రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. ఆయన తాను ఒక రాష్ట్ర స్థాయి నాయకుడనన్న సంగతిమర్చి పోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏపీలో ఉత్తరాంద్ర, రాయలసీమకు చెందిన కొందరు తమకు రాష్ట్రాలు కావాలని అంటున్నారని, వారు అలా వ్యవహరిస్తే తనలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరని అన్నారని వార్త వచ్చింది. ఎవరో ఒకరిద్దరు తమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన వంటి పక్షాలు వ్యవహరిస్తున్నాయన్న భావనతో అలాంటి వ్యాఖ్యలు చేస్తే చేసి ఉండవచ్చు. అలా మాట్లాడడం తప్పు అని పవన్ భావించవచ్చు. అంతవరకు అభ్యంతరం లేదు. విభజన వాదంతో మాట్లాడవద్దని ఆయన సలహా ఇవ్వవచ్చు.

కానీ అలా చేయకుండా రాజకీయ ప్రేరితంగా ప్రజలను రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో, అదేదో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇది ఉపయోగపడుతుందేమోనన్న ఆశతో ఆయన మాట్లాడినట్లు అర్దం అవుతుంది.పోనీ ఈయనకు అంతగా ఆంద్ర ప్రదేశ్ పై ప్రేమ ఉంటే, తెలంగాణకు వెళ్లి జై తెలంగాణ అని ఎందుకు అంటున్నారు. తెలంగాణ నేతలు, తెలంగాణ ప్రజలు తనకు స్పూర్తి అని ఎందుకు అంటున్నారు. ఏపీలో ఈ డబ్బై ఏళ్లలో ఆయనకు నచ్చిన నేతలు ఎవరూ లేరా?, ఏపీ ప్రజలలో స్పూర్తి లేదన్నది ఆయన భావనా? తాను తీవ్రవాదిని అవుతానని హెచ్చరిస్తున్నారు.

తీవ్రవాదం అంటే హింసకు పాల్పడడం. ఎవరిపైన హింసకు దిగుతారు? ఇది జనసేన కార్యకర్తలకు పనికి వచ్చే సందేశమేనా? పార్టీ నేతే ఇలా తీవ్రవాదిగా మారితే పార్టీ కార్యకర్తలు ఇంకెలా మారాలి? అది అసలు ప్రజాస్వామ్యమే అవుతుందా?నిజంగానే పవన్ కళ్యాణ్ లో ఆ ఆవేశం ఉందా అని ఆలోచిస్తే పలు సందేహాలు వస్తాయి. ఆయన సినిమాలలో మాదిరి ఆవేశాన్ని రాజకీయాలలో కూడా నటించాలని చూస్తున్నట్లుగా ఉంది. కానీ అది ఇట్టే తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్‌కు అంత ఆవేశమే ఉంటే, తనకు పరిటాల రవి గుండు కొట్టించారంటూ టీడీపీ ఆఫీస్ నుంచే ప్రచారం చేశారని ఆయనే చెప్పారు కదా!

కానీ తదుపరి అదే పార్టీకి మద్దతుగా ఆయనే ప్రచారం చేశారే! అంతేకాదు.టీడీపీ నేత, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేన వారిని ఉద్దేశించి అలగా జనం, సంకరజాతి జనం అని ఎద్దేవా చేసినప్పుడు పవన్ కళ్యాణే ఒక బహిరంగ సభలో తప్పు పట్టారు. అయినా బాలకృష్ణ దానిపై ఏమి సమాధానం ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బాలకృష్ణ ఎదురుగా కూర్చుని అన్ స్టాపబుల్‌గా నవ్వుతూ కనిపించారు. తనను కానీ, తన పార్టీవారిని కానీ అవమానించినప్పుడు ఆయనలోని తీవ్రవాది ఎందుకు బయటకు రాలేదు. పైగా వారితోనే రాజీపడ్డారే. రాష్ట్ర విభజన మీద ఆయనకు అంత వ్యతిరేకత ఉంటే ,అందుకోసం ఒకటికి ,రెండుసార్లు లేఖలు ఇచ్చిన తెలుగుదేశంకు మద్దతుగా 2014లో ఎందుకు ప్రచారం చేశారు? విభజనకు పూర్తి అనుకూలంగా ఉన్న బీజేపీ వైపు ఎందుకు ఉన్నారు?తిరిగి ఇప్పుడు టీడీపీతో జట్టుకట్టి అధికారంలోకి రావాలని ఎందుకు తాపత్రయపడుతున్నారు.

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చేగువేరా బొమ్మ పెట్టుకుని తిరిగినప్పుడు ఈయనలో కమ్యూనిస్టు ఉన్నారని పలువురు భ్రమించారు. ఆ వెంటనే ఆయన బీజేపీతో జట్టుకట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. చెగువేరా బొమ్మ పెట్టుకోగానే తీవ్ర వాది అయిపోయారా? బీజేపీతో కలిసినంతమాత్రాన దేశీయవాది అయిపోయారా! ఏదో ఆయన ఎప్పటికి ఏ ఆలోచన వస్తే అది చేస్తుంటారేమో! ఎప్పుడు ఏ డైలాగు గుర్తుకు వస్తే ఆ డైలాగు చెబుతుంటారేమో! ఇప్పుడు తీవ్రవాదిని అవుతానన్న డైలాగు కూడా అలాంటిదే అనుకోవచ్చేమో! రాజ్యాంగం చదివారా? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తాను అది చదివి ఉంటే తీవ్రవాదిని ఇంకోసారి చూడరని అంటారా! రాయలసీమ నుంచి పలువురు ముఖ్యమంత్రులు వచ్చారని చెబుతున్న ఆయన టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అందరికన్నా ఎక్కువకాలం సి.ఎమ్.గా ఉన్న విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్నారు. మాట్లాడేదానికి హేతుబద్దత లేకపోతే అంతా నాటకీయంగానే ఉంటుంది. దానిని ఎవరూ సీరియస్ తీసుకోరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతేనేమో!
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Advertisement
 

తప్పక చదవండి

Advertisement