రెండు నాలుకలకు కేరాఫ్ చంద్రబాబు

Article On Chandrababu Naidu Telangana Tour - Sakshi

అబద్దాలు సిగ్గు పడేలా బాబు వ్యాఖ్యలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించిన తీరు ఆసక్తికరంగానే ఉంది. ఆయన ఏపీలో పర్యటిస్తున్న సందర్భంలో చేస్తున్న ప్రసంగాలపై ప్రజలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదనో, లేక చెప్పిన విషయాలే చెప్పి విసిగించవలసి వస్తోందని భావిస్తున్నారో తెలియదు కాని, తెలంగాణ నుంచి ప్రచారం చేసుకుంటున్నట్లుగా ఉంది. ఆయన టూర్ తెలంగాణలోనే అయినా, గురి మాత్రం ఏపీనే అన్నది అవగతమవుతూనే ఉంది. తెలంగాణలో గతంలో తాను చాలా చేశానని పబ్లిసిటీ చేయడం ద్వారా ఏపీ ప్రజలను ప్రభావితం చేయాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.  

కొట్టారులే డబ్బా.!
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని బిజినెస్ స్కూల్లో ఆయన చేసిన ఉపన్యాసాన్ని పరిశీలించినా, ఖమ్మం స్పీచ్ ను చూసినా ఈ విషయం అర్ధం అవుతుంది. తెలంగాణను తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా తాను అభివృద్ది చేశానని చెప్పారు. హైదరాబాద్‌లో  ఐటి రంగం అంతా తన సమయంలోనే వచ్చిందన్న భావన కల్పించాలన్నది ఆయన లక్ష్యం. మైక్రోసాప్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను కలిసిన విషయాన్ని పదే, పదే చెప్పుకుంటారు. నిజంగానే ఐటీ రంగం అంతా ఆయనే అబివృద్ది చేసి ఉంటే ఐదేళ్ల విభజిత ఏపీ పాలనలో  ఎందుకు మైక్రోసాఫ్ట్ను తీసుకు రాలేకపోయారో వివరించి ఉంటే బాగుండేది. ఒకటి, రెండు చిన్న కంపెనీలు, మరో కంపెనీ చిన్న శాఖ వంటివి మినహా ఎందుకు ఆయన టైమ్ లో ఏపీ ఐటి పరిశ్రమలను ఆకర్షించలేకపోయిందంటే దానికి సమాదానం ఉండదు. 

చేసింది నిర్వాకం.. గొప్పలేమో ఘనం
హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ అలాంటిది. విస్తారమైన భూమి, ము ఖ్యంగా పంటలు పండని భూములు అధికంగా ఉండడం కలిసి వచ్చింది. నిజానికి హైదరాబాద్ లో ఐదేళ్ళు ఆలస్యంగా ఐటి వచ్చిందని  చెప్పాలి. అంతకు ముందే బెంగుళూరులో అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌ఎమ్‌ కృష్ణ ప్రభుత్వం ఉండగా ఐటి రంగం బాగా పెరిగింది. అప్పట్లో తెలుగుదేశం అంతర్గత కలహాలు, ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించే పనిలో చంద్రబాబు వర్గం ఉన్న నేపథ్యంలో ఐటిని పట్టించుకోలేదని చెప్పాలి. తదుపరి 1999 తర్వాత హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం నిర్మించారు. అంతవరకు చంద్రబాబు క్రెడిట్. కానీ తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఐటి రంగం బాగా అభివృద్ది చెందింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరుతో  ఒక ఆధునిక నగరం తయారీకి సదుపాయాలు కల్పించింది వైఎస్ ప్రభుత్వమే. అందుకు కృషి చేసిన వ్యక్తి  సీనియర్ ఐఎఎస్ అధికారి బి.పి.ఆచార్య. 

ఎవరి గొప్ప ఎంత? బాబుకొక్కడికే ఎందుకు బాజా?
విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇరవై ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ఇప్పటికీ తను మాత్రమే  అభివృద్ది చేసినట్లు,  తదుపరి అసలేమీ జరగలేదన్నట్లు పిక్చర్ ఇస్తుంటారు. ఆ మాటకు వస్తే నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరామసాగర్ వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించిన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, తదుపరి తెలుగు గంగను నిర్మించిన ఎన్టీ రామారావు వంటివారిని ఎంత గొప్పవారనాలి? కాకపోతే వారెప్పుడూ స్వోత్కర్షకు ప్రాదాన్యం ఇవ్వలేదనుకోవాలి. ఈ ఇరవై ఏళ్ల కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చిన విశేష ప్రాధాన్యం వల్ల తెలంగాణ అయినా, ఏపీ అయినా మంచి ప్రయోజనం పొందాయన్నది వాస్తవం. మరి కేసీఆర్‌ ఏకంగా ఎనభైవేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ఎనిమిదేళ్లలో హైదరాబాద్ లో పలు ప్లైఓవర్లు, పెక్కు ఐటి పరిశ్రమలు వచ్చాయికదా! 
 
ఖమ్మంలో బయటపడ్డ బాబు రంగు
తెలంగాణలో తెలుగుదేశం లేదన్నవారికి తన సభే సమాధానం అని చంద్రబాబు ఖమ్మంలో చెప్పారు. అదే నిజమైతే ఆయన ఇక్కడ అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి గురించి కాని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైన కాని, పోనీ చివరికి కాంగ్రెస్ మీదకాని అసలు విమర్శలు చేయడానికే ఎందుకు వెనుకాడారో జనం ఊహించలేరా? 2014లో ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనను అప్పట్లో ఎద్దేవా చేసిన చంద్రబాబు ఎందుకు ఇప్పుడు నోరు మెదపడం లేదు? ఓటుకు నోటు కేసు  దెబ్బతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదలివెళ్లి ఆంద్రులకు అన్యాయం చేసింది అవాస్తవమా? ఎవరైనా అధికారంలోకి రావాలనుకుంటే ముందుగా అధికారంలో ఉన్న పార్టీలను విమర్శించడం, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పగలగాలి.

ఈ రెండు ఆయన చేయలేకపోయారు. కాకపోతే తాను అది చేశా..ఇది చేశా.. అని చెప్పుకున్నారు. అందులో వాస్తవాలు ఉన్నాయా? లేదా? అన్నది వేరే విషయం. ఆ మాటకు వస్తే తెలంగాణలో వైఎస్ ఆర్ టిపి పేరుతో పార్టీని స్థాపించి పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలకు ఉన్న దైర్యం కూడా చంద్రబాబుకు లేదా అన్న ప్రశ్న వస్తే ఏమి జవాబిస్తారు? ఆమె బిఆర్ఎస్ పైన, ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పాదయాత్ర సాగిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లను కూడా విడిచిపెట్టడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్ కు వెళతానంటూ కారులోనుంచి దిగకుండా ఉన్న ఘట్టం సంచలనం సృష్టించింది. మరి చంద్రబాబుకాని, టీడీపీ తెలంగాణ నేతలు కాని అలాంటి సాహసాలు చేయగలరా? 

పొత్తు పెట్టుకుందాం ప్లీజ్..!
ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌పై చంద్రబాబు, తెలుగుదేశం దారుణమైన విమర్శలు చేస్తుంటారు. ప్రతీసారి ఏదో ఒక వివాదం సృష్టించి కోర్టుల్లో పిటీషన్లు వేసి అడ్డంకులు సృష్టించి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడతారు. మరి తెలంగాణలో ఎందుకు అలా చేయడానికి భయపడుతున్నారు? అలా చేస్తే తనకు  ఏ ప్రమాదం ఎదురవుతుందో చంద్రబాబుకు తెలుసు. తెలుగుదేశం ఏపీలో అధికారంలోకి వస్తే చాలు అన్న ఆశతోనే ఆయన పర్యటిస్తున్న  విషయం అర్ధం అవుతూనే ఉంది.

అక్కడ ముఖ్యమంత్రి జగన్ను ఎదుర్కోవడమే కష్టం గా ఉంది. దాంతో ఇతర పార్టీలను కలుపుకోవాలని ఆయన ఆరాట పడుతున్నారు. అందుకు ప్రాతిపదికగా తెలంగాణలో ఏదైనా అవకాశం ఉంటే బీజేపీతో మళ్లీ కలవడానికి యత్నిస్తున్నారట. తద్వారా ఏపీలో పొత్తు మార్గం సుగమమం చేసుకోవాలన్నది ఆయన భావన అట. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న యత్నాలలో బీజేపీ ఉంది. వారికి తన పార్టీ బలం కూడా ఉపయోగపడుతుందన్న సంకేతం పంపడానికి తంటాలు పడుతున్నారట. ఇప్పటికైతే బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు సిద్దపడడం లేదు. అందుకే ఇలా సభలు పెట్టి బీజేపీ వారి దృష్టిలో పడాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. గతసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని,ఆ తర్వాత దానిని వదలిపారేశారు.  

అక్కడ అలా.. ఇక్కడ ఇలా
చంద్రబాబు తన సొంత వ్యూహమో, లేక తాను నియమించుకున్న వ్యూహకర్తల యోచనో తెలియదు కాని ప్లాన్  సక్సెస్ అవుతుందా అంటే చెప్పలేం. విభజన గురించి కూడా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఆయన రెండు రాష్ట్రాలు ఇక కలవబోవని చెబుతున్నారు. మంచిదే.

మరి ఇదే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు ఏపీలో సమైక్యవాదులతో కలిసి ఎందుకు డ్రామా ఆడారు?అంటే తనకు చిత్తశుద్ది లేదన్నమాటే కదా? రాష్ట్ర విభజనకు సోనియాగాంధీ కారణం అంటూ ఆమెను దెయ్యం, రాక్షసి అంటూ ఎందుకు విమర్శలు చేశారు? తెలంగాణకు వచ్చి తన లేఖల వల్లే రాష్ట్రం వచ్చిందని, ఏపీకి వచ్చి రాష్ట్రాన్ని విడదీసి నాశనం చేస్తారా అని విమర్శలు గుప్పించిన చంద్రబాబు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తనది రెండు నాలుకల దోరణి అని పదే,పదే రుజువు చేసుకుంటున్నారు.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top