రాహుల్‌ సేనపై దృష్టి

Apprehension prevails in Congress after Sachin Pilot rebellion - Sakshi

న్యూఢిల్లీ: జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్‌ తదితర తనకు సన్నిహితులైన యువ నాయకులకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా రాహుల్‌ గాంధీ పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించారు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లో తిరుగుబాటు చేసి, బీజేపీలో చేరి, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చారు. తాజాగా, రాజస్తాన్‌లో సచిన్‌ పైలట్‌ రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుతూ సీఎం గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు.  దాంతో, ఇప్పుడు అందరి దృష్టి రాహుల్‌ బ్రిగేడ్‌లో మిగిలిన నాయకులపై పడింది. ‘తరువాత ఎవరు?’ అనే ప్రశ్న కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

‘అత్యంత తక్కువ సమయంలో పార్టీలో ఉన్నత స్థాయికి వెళ్లినవారే బయటకు వెళ్లారంటే పార్టీ తీరులో ఏదో లోపం ఉన్నట్లే’ అని సీడబ్ల్యూసీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. రాహుల్‌ సన్నిహితులకు పార్టీలో కీలక పదవులు దక్కడాన్ని పార్టీలో కొందరు జీర్ణించుకోలేకపోయారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాహుల్‌ సేనలో హరియాణా మాజీ పీసీసీ చీఫ్‌ అశోక్‌ తన్వర్, మధ్యప్రదేశ్‌ మాజీ పీసీసీ అధ్యక్షుడు అరుణ్‌ యాదవ్, మహారాష్ట్రలో  మిలింద్‌ దేవ్‌రా, సంజయ్‌ నిరుపమ్, పంజాబ్‌ మాజీ పీసీసీ అధ్యక్షుడు ప్రతాప్‌ సింగ్‌ బాజ్వా, కర్ణాటకలో సీనియర్‌ నేత దినేశ్‌ గుండూరావు ఉన్నారు.  వీరిలో చాలామంది గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారని, పదవి పోవడంతో పార్టీలో గ్రూప్‌ రాజకీయాలు ప్రారంభించారని పార్టీ వర్గాలు తెలిపాయి. నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తే.. కొందరు రాహుల్‌కు విశ్వాసఘాతకులుగా మారారన్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top