ధర్మపరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి కొట్టు సత్యనారాయణ

Ap Minister Kottu Satyanarayana Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: సీజీఎఫ్ ద్వారా పెద్ద ఎత్తున దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో 1330 దేవాలయాల పనులు జరుగుతున్నాయని, మరో 1465 దేవాలయాలను అదనంగా నిర్మిస్తున్నామన్నారు.  ప్రతీ 25 దేవాలయాల పర్యవేక్షణకు ఒక ఏఈవో నియమిస్తామని, రూ. 270 కోట్ల రూపాయల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల పనులను చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.

‘‘ధర్మ పరిరక్షణే మా ప్రభుత్వ ధ్యేయం. ధర్మం పరిరక్షింపబడాలంటే దేవాలయాలుండాలి. జనవరి 4 నాటికి 68 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. నూతనంగా నిర్మించే ప్రతీ ఆలయంలో ధూపదీప నైవేద్యాలు జరిగేలా చర్యలు చేపడతామన్నారు. ధూపదీప నైవేద్యాలు చేసే అర్చకులకు 5 వేలు ఇస్తాం. శ్రీశైలంలో అన్నదాన సత్రానికి భూములిచ్చే విషయం పై పాలసీమ్యాటర్‌ను పరిశీలిస్తున్నామని మంత్రి అన్నారు.

‘‘లోకేష్ పాదయాత్రను పిచ్చోడి పాదయాత్రగా మంత్రి అభివర్ణించారు.  లోకేష్‌ పాదయాత్రలో ఏదిపడితే అది మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ‘‘నేను అధికారంలోకి రాగానే అందరి అంతూ తేల్చేస్తానంటున్నాడు. పాదయాత్రతోనే ముఖ్యమంత్రిని అయిపోయాననే భ్రమలో లోకేష్ ఉన్నాడు. తండ్రీ, కొడుకులు చేసే పనులు ప్రజలపై కక్ష తీర్చుకునేలా ఉన్నాయి. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడు?. తన సభల్లో చంద్రబాబు చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు టన్నులు టన్నులు మా పై విషం కక్కుతున్నారు’’ అంటూ మంత్రి ప్రశ్నించారు.

‘‘భగవంతుడికి అపకారం చేశారు కాబట్టే చంద్రబాబు,లోకేష్‌లకు శిక్షపడింది. దేవాలయాల భూములు కాజేసిందెవరో.. అమ్మేసిందెవరో అందరికీ తెలుసు. తన తండ్రి చేసిన పనులు గుర్తుకొచ్చి.. లోకేష్ మాపై ఆరోపణలు చేస్తున్నాడు. విజయనగరం భూముల వ్యవహారం రెండు నెలల క్రితమే మా దృష్టికి వచ్చింది. ఉద్యోగులను.. ఈవోను సస్పెండ్ చేశాం. ఎంక్వైరీకి ఆదేశించాం.. రిపోర్టు రాగానే బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి అన్నారు.
చదవండి: దుష్టచతుష్టయానికి దత్తపుత్రుడు జతకలిశాడు: సీఎం జగన్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top