YSR Kadapa: కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీ జయకేతనం

AP Local Body Election Results 2021: YSR Kadapa - Sakshi

జిల్లాలో ఫ్యాను గాలి ఉధృతంగా వీచింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అప్రతిహత విజయం సాధించింది. ఓటర్లు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అధికార పార్టీ హవా ముందు టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీనే వరించనుంది. స్థానిక ఎన్నికల్లో వరుసగా తిరుగులేని విజయాలను నమోదు చేసుకుంటున్న అధికార పార్టీలో విజయోత్సాహం నెలకొంది. 

సాక్షి, వైఎస్సార్‌ కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు ఏవైనా వైఎస్సార్‌సీపీ వైపే ప్రజలు నిలిచారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనకు మద్దతు ఇస్తూ తిరుగులేని ఆధిక్యతను అందించారు. కనీవినీ ఎరుగని రీతిలో అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజార్టీని అందిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఓటు అస్త్రంతో వైఎస్సార్‌ సీపీకి పట్టం కట్టారు.

సార్వత్రిక ఎన్నికల అనంతరం రెండేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం తప్పలేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభంజనంలో  కేవలం అంతంత మాత్రం సీట్లు దక్కించుకోలేక టీడీపీ సైకిల్‌ గాలికి కొట్టుకుపోయింది. ఊహించని దెబ్బకు టీడీపీ నాయకులు ఇంటి నుంచి బయటికి రాలేక ముఖం చాటేశారు.  

92 స్థానాల్లో తిరుగులేని విజయం 
జిల్లా మొత్తం మీద 554  ఎంపీటీసీ స్థానాలు ఉండగా 432 స్థానాలు ఏకగ్రీవం కాగా...అందులో 423 స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఏడు స్థానాలను టీడీపీ, రెండు స్థానాలు బీజేపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 117 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం వీటికి సంబంధించి కౌంటింగ్‌ జరగ్గా అందులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తిరుగులేని మెజార్టీ లభించింది.

117 స్థానాలకుగాను 92 స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగుర వేశారు. టీడీపీ కేవలం 11  స్థానాలకు పరిమితం కాగా, ఏడు స్థానాలు బీజేపీకి దక్కగా, మరో ఐదు స్థానాల్లో ఇండిపెండింగ్‌ అభ్యర్థులు అనూహ్యంగా విజయం సాధించారు. జమ్మలమడుగు మండలం గొరిగనూరు, ముద్దనూరు మండలం కొర్రపాడు ఎంపీటీసీలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సుల్లోకి నీరు చేర డంతో అధికారులు కౌంటింగ్‌ పెండింగ్‌లో ఉంచారు. 

వైఎస్సార్‌సీపీ ఖాతాలో 10 జెడ్పీటీసీలు 
జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతోంది. 50 మండలాలకు చెందిన 38 జెడ్పీ స్థానాలు వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 12 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివారం కౌంటింగ్‌ నిర్వహించారు. ఇందులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 12 స్థానాలకుగాను 10 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. కేవలం టీడీపీకి గోపవరం జెడ్పీటీసీ స్థానం మాత్రమే దక్కింది. 

పేరుకే అభ్యర్థులు..కనిపించని ఓటు: జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది పేరుకే అభ్యర్థులుగా కనిపించారు. తీరా కౌంటింగ్‌ కేంద్రాల్లో చూస్తే వారికి ఒక్క ఓటు కూడా పడలేదు. చివరికి వారి ఓటు కూడా వారు వేసుకోలేదు. అభ్యర్థుల జాబితాలో పేరున్నా చివరికి వారికి ఒక్క ఓటు కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. రైల్వేకోడూరు ఎంపీటీసీ పరిధిలో ఇద్దరు అభ్యర్థులు అలా కనిపించగా, మిగిలిన చోట్ల కూడా ఇలా ఓటు పడని అభ్యర్థులు కనిపించారు.  

సంబరాల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు 
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి అత్యధిక స్థానాలు వైఎస్సార్‌ సీపీ కైవసం చేసుకోవడంతోపాటు ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎక్కడికక్కడ  స్థానిక నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి పండుగ నిర్వహించుకున్నారు. గెలిచిన అభ్యర్థులు స్వీట్లు తినిపించుకుని కేకులు పంచుతూ ఆనందంలో మునిగిపోయారు. 

ఆ ముగ్గురికి భారీ మెజార్టీ 
రైల్వేకోడూరు జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పాలెంకోట రత్నమ్మ 25,100 ఓట్ల భారీ మెజార్టీతో ప్రత్యర్థి జనసేన అభ్యర్థి మధులతపై విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితం కాగా, జిల్లాలోనే అత్యధిక మెజార్టీ రైల్వేకోడూరు అభ్యర్థికి దక్కింది. తర్వాత స్థానంలో నందలూరు వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఉషారాణి 20,556 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి జనసేన అభ్యర్థి నాగమణిపై గెలుపొందారు. ఇక్కడ కూడా టీడీపీ మూడో స్థానానికే  పరిమితమైంది. అలాగే  చిట్వేలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పుష్పలత కూడా 19,578 ఓట్ల భారీ ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు.  

సంక్షేమం, అభివృద్ధికే పట్టం 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జిల్లాలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రభావం జిల్లాలో తీవ్రంగా ఉంది.   ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులతోపాటు పరిశ్రమలను సైతం ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సర్వం సిద్ధం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ప్రాజెక్టులకు కృష్ణా జలాలను తరలించి సాగు, తాగనీటి కష్టాలను తీర్చింది. జిల్లా ప్రజలంతా వైఎస్‌ జగన్‌ పాలన  పట్ల మరింత ఆకర్షితులయ్యారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top