Prakasam: విజయ పంకా..

AP Local Body Election Results 2021: Prakasham - Sakshi

పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని సృష్టించింది. బ్యాలెట్‌ బాక్స్‌లు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచీ ఫ్యాన్‌ స్పీడు కొనసాగింది. ఆ జోరుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్రస్‌ లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలని టీడీపీ పన్నిన కుయుక్తులకు ప్రజలు ఓటుతో సమాధానమిచ్చారు. 55 జెడ్పీటీసీ, 628 ఎంపీటీసీ స్థానాల్లో విజయదుందుభి మోగించి జిల్లాలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారయంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.  

సాక్షిప్రతినిధి, ఒంగోలు:  స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతూనే ఉంది. గతంలో జరిగిన సర్పంచ్‌లు, మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి 90 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌ సీపీ పరిషత్‌ పోరులోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది. పరిషత్‌ పోరులో వైఎస్సార్‌సీపీ మరింత దూకుడు పెంచగా, టీడీపీ అడ్రస్‌ గల్లంతైంది. మిగిలిన పారీ్టల ఉనికి సైతం లేని పరిస్థితి. జిల్లాలో 56 మండలాలుండగా అందులో 55 మండలాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి టీడీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. చివరకు ఎన్నికలయ్యాక కూడా కౌంటింగ్‌ను నిలిపేస్తూ వచ్చింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని ముందుగానే తెలుసుకున్న టీడీపీ కోర్టులను అడ్డుపెట్టుకొని ఏడాదిగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు.

జిల్లాలో 55 జెడ్పీటీసీ స్థానాలకు గాను 14 జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకోగా, 41 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో 41 జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకొని జిల్లాలో ఉన్న 55 జెడ్పీటీసీలను తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా జిల్లాలో 784 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో 68 చోట్ల ఎన్నిక నిలిచిపోయిన విషయం తెలిసిందే. 348 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం ఎన్నికలు జరిగిన 716 ఎంపీటీసీల్లో 628 వైఎస్సార్‌సీపీ, 64 టీడీపీ, 21 ఇండిపెండెంట్‌లు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఒక్కొక్క స్థానాన్ని దక్కించుకున్నాయి. వరుస విజయాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉండగా, ఘోర పరాజయాల పరంపర కొనసాగుతుండటంతో టీడీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో అయితే టీడీపీ ఖాతా కూడా తెరవని పరిస్థితి.


పది శాతం స్థానాలకు పరిమితమైన టీడీపీ:   
2019 ఎన్నికల్లో జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 4 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెలువడిన ఎంపీటీసీ ఫలితాల్లో జిల్లాలో  పది శాతం స్థానాలను కూడా దక్కించుకోలేక చతికలపడింది. 55 జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేని దుర్భర పరిస్థితి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పారీ్టలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తుండటంతో ప్రజల్లో  ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో సైతం అన్ని జిల్లా పరిషత్, మండల పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేయటం చూస్తుంటే టీడీపీ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది.

టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాలకు హాజరై సూచనలు చేయాల్సి ఉన్నా జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేసి రాజకీయ డ్రామాలకు తెరతీయటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు చూస్తుంటే టీడీపీ పై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే జనసేన, కాంగ్రెస్‌ పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఈ రెండు పారీ్టలు ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా గెలవలేదు.

చదవండి: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్ర యాత్ర

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top