Etela Rajender Will Resign For His MLA Post And TRS Party Tomorrow - Sakshi
Sakshi News home page

Etela Rajender: టీఆర్‌ఎస్‌కు ఈటెల గుడ్‌బై!

Jun 3 2021 2:49 PM | Updated on Jun 4 2021 9:32 AM

Etela Rajender Will Resign To TRS Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసైన్డ్‌ భూముల ఆక్రమణ ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు షామీర్‌పేటలోని తన నివాసంలో జరిగే మీడియా సమావేశం వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీలో చేరాలని ఇప్పటికే నిర్ణయించుకున్న ఈటల... శుక్రవారం జరిగే మీడియా సమావేశంలో చేరిక ముహూర్తాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది.

ఈ నెల 8న ఈటల బీజేపీలో చేరే అవకాశముంది. ఉద్యమకాలం నుంచి టీఆర్‌ఎస్‌లో తన పాత్రను వివరించడంతోపాటు తనకు ఎదురైన ఇబ్బందులపై మరోమారు ఈటల మీడియాతో మాట్లాడనున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని గురువారం హైదరాబాద్‌ చేరుకున్న ఈటల... హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

రాజీనామాపై అనుచరుల్లో భిన్నాభిప్రాయాలు...
అనుచరులతో భేటీలో ఈటల తన ఢిల్లీ పర్యటన వివరాలను ముక్తసరిగా వెల్లడించారు. టీఆర్‌ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై అనుచరుల నుంచి అభిప్రాయాలు కోరారు. అయితే పార్టీని వీడటంపై అనుచరుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవగా ‘వారు పొమ్మనే వరకు ఉండటం సరైనదేనా’ అని ఈటల అనుచరులను ప్రశ్నించినట్లు సమాచారం. కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదన ఆలోచనేదీ లేదని, బీజేపీలో చేరడం గురించే అభిప్రాయాలు కోరినట్లు ఈటల వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి శుక్రవారం జరిగే మీడియా సమావేశంలోనే అన్ని వివరాలు వెల్లడిస్తానని అనుచరులతో వ్యాఖ్యానించారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వెంట నడుస్తామని అనుచరులు హామీ ఇచ్చారు.

బీజేపీ నుంచి గట్టి హామీతోనే..
ఢిల్లీలో మూడు రోజులపాటు పర్యటించిన ఈటల రాజేందర్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, మరికొందరు నేతలతో భేటీ అయ్యారు. పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ అధిష్టానం నుంచి గట్టి హామీ లభించడంతో కమలదళంలో చేరికకు సంబంధించిన విధివిధానాలను కూడా ఈటల ఢిల్లీలోనే ఖరారు చేసుకొని హైదరాబాద్‌ చేరుకున్నారు.

శుక్రవారం ఈటల మీడియా సమావేశం తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా పార్టీలో ఈటల చేరిక ప్రకటనను స్వాగతిస్తూ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈటలతోపాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ కూడా పార్టీని వీడే అవకాశం ఉంది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ఈటల హుజూరాబాద్‌ నియోజకవర్గ పర్యటన షెడ్యూల్‌ను కూడా ప్రకటించే అవకాశముంది.

నిశితంగా గమనిస్తున్న టీఆర్‌ఎస్‌...
ఢిల్లీ పర్యటన మొదలుకొని గురువారం ఈటల నివాసంలో చోటుచేసుకున్న పరిణామాలను టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. పార్టీని వీడాలని ఈటల నిర్ణయించుకున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ప్రకటన జారీ చేసే అవకాశముందని సమాచారం. అయితే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగాన్ని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధిష్టానం చేతుల్లోకి తీసుకుంది.

ఈ నేపథ్యంలో ఈటలను సస్పెండ్‌ చేయడం ద్వారా ఆయనకు అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్య పార్టీలో కొనసాగడం, 2018 ఎన్నికల్లో తిరిగి టికెట్‌ ఇవ్వడం వంటి పరిణామాలను పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ను ఈటల వీడటాన్ని సీరియస్‌గా తీసుకోవద్దనే అభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు సమచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement