వర్షం.. రైతుకు కష్టం | - | Sakshi
Sakshi News home page

వర్షం.. రైతుకు కష్టం

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

● తడిసి ముద్దయిన పత్తి, ధాన్యం ● నేడు పెద్దపల్లిలో పత్తి కొనుగోళ్లు బంద్‌

పెద్దపల్లిరూరల్‌: అకాల వర్షం అన్నదాతను మరో సారి ముంచింది. బుధవారం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పత్తి, ధాన్యం పంటలు తడిసిముద్దయ్యాయి. పలు ప్రాంతాల నుంచి స్థానిక మార్కెట్‌ యార్డుకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం, పత్తి ఒక్కసారిగా కురిసిన వర్షంతో నీటిపాలైంది. రైతులు టార్పాలిన్లు కప్పేందుకు నానాతంటాలు పడ్డారు. ఎలాగోలా టార్పాలిన్లు కప్పినా అప్పటికే పత్తి, ధాన్యం తడిసిందని కన్నీటిపర్యంతమయ్యారు.

అసలే అంతంత దిగుబడి

ఈసారి పంటలకు సరిపడా నీరందక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. పంటలు అంతంత మాత్రంగానే చేతికి వచ్చాయని రైతులు భావిస్తున్న తరుణంలో అకాల వర్షాలు మరింత ఆవేదనకు గురిచేశాయని అన్నదాతలు వాపోయారు.

నేడు పత్తి కొనుగోళ్లు బంద్‌

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. రైతులు పత్తిని తీసుకు రావొద్దని కోరారు. వాతావరణ శాఖ గురువారం కూడా వర్షసూచన ఉన్నట్టు పేర్కొనడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వివరించారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసింది. పెద్దపల్లిలో 5 మి.మీ., భోజన్నపేటలో 4 మి. మీ., కమాన్‌పూర్‌లో 3మి.మీ., సుగ్లాంపల్లిలో 6మి. మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. పెద్దపల్లిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భోజన్నపేట ప్రాంతంలో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement