పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడంతోపాటు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో 56 రక్షణ కమిటీలు ఏర్పాటు చేసింది.
448 అవగాహన సదస్సులు
జిల్లాలో సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, ఇటుక బట్టీలు , రైస్‌మిల్లులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ పరిశ్రమలు చాలాసంఖ్యలోనే ఉన్నాయి. వీటిల్లో 56 మహిళా రక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జిల్లావ్యాప్తంగా 448 అవగాహన సదస్సులు నిర్వహించారు. అయితే, ఈ ఏడాది జిల్లాలో వేధింపుల కేసులు నమోదు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి.
లక్షమంది మహిళా ఉద్యోగులు
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష మంది మహిళలు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారని అంచనా. వీరికి అండగా నిలిచేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో 50, ప్రైవేట్ కార్యాలయాల్లో ఆరు మహిళా రక్షణ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతీ కమిటీలో ఇద్దరు సీనియర్ మహిళా ఉద్యోగులు, మరోఇద్దరు సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. చట్టాలపై అవగాహనతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారికి సభ్యత్వంలో ప్రాధాన్యం కల్పించారు.
పరిశ్రమల్లో అవగాహన సదస్సులు
మహిళా కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు, డీడబ్ల్యూవో ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వివిధ పరిశ్రమల్లో ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించారు. యాజమాన్యాలు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తూ చైతన్యవంతం చేస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో లైంగిక, సాంఘిక వేధింపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చట్టాలు, బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
గుడ్ టచ్.. బాడ్ టచ్ గురించి..
చిన్నతనం నుంచే విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఉపాధ్యాయులు పాఠశాలల స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు, కుటుంబ సభ్యులు మినహా ఇతరులెవ్వరూ గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ లాంటి చర్యలకు పాల్పడితే వెంటనే సంబంధిత అధికారులు, తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
ఫిర్యాదులపై విచారణ
కార్యాలయాల్లో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడం కమిటీల ప్రధాన బాధ్యత. ఉద్యోగినులు వేధింపులకు గురైనట్లు ఫిర్యాదు చేస్తే కమిటీ విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తుంది. చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుంది. మహిళలు ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించేందుకు ఈ కమిటీలు భరోసా ఇస్తాయని మహిళా సాధికారత కేంద్రం అధికారులు తెలిపారు.
అవగాహన కల్పిస్తున్నాం
ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఇతర పరిశ్రమల్లో మహిళా ఉద్యోగులు, సిబ్బందికి భద్రత కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇందులో డీడబ్ల్యూవో వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తోంది. పరిశ్రమల్లో ఇప్పటివరకు 53 కమిటీలు ఏర్పాటు చేశారు. 448 అవగాహన సదస్సులు నిర్వహించారు. భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తాం.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్


