అభివృద్ధి గుర్తుపై అధికారుల కత్తి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి గుర్తుపై అధికారుల కత్తి

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

● వివాదంగా మారిన పైలాన్‌ తొలగింపు ● ముందుచూపు లేని మున్సిపల్‌ అధికారులు

గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధికి గుర్తుగా నిలిచిన పైలాన్‌ తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరపకుండా మున్సిపల్‌ అధికారులు తొలగింపు చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పైలాన్‌ నిర్మాణం మాత్రమే కాదని, అప్పట్లో చేపట్టిన అభివృద్ధికి గుర్తుగా ఉందని గత పాలకులు పేర్కొంటున్నారు. అలాంటి గుర్తును తొలగించే ముందు సంబంధిత రాజకీయ పార్టీల నాయకులకు సమాచారం ఇవ్వడంతోపాటు, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులపై ఉందని అభిప్రాయపడుతున్నారు.

సంప్రదింపులు లేకుండానే..

ముందస్తు సంప్రదింపులు లేకుండానే పైలాన్‌ తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టడం వివాదానికి కారణమైంది. సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 8 గంటల పాటు అధికారులు, నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. అభివృద్ధి పనులకు సంబంధించిన గుర్తులను తొలగించే విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని నాయకులు ప్రశ్నిస్తున్నారు. పరిపాలనాపరమైన నిర్ణయా లు తీసుకునే సమయంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

అధికారుల తీరుపై ఆగ్రహం

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం లేకుండానే పైలాన్‌ను ఏకపక్షంగా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు చౌరస్తాలోని పైలాన్‌ను మంగళవారం తొలగించి, కొత్తగా నిర్మి స్తున్న పార్క్‌లో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ముందు చెప్పకపోవడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. గత ప్రభుత్వ బీఆర్‌ఎస్‌ నాయకులతో సంప్రదింపులు జరిపి ఉంటే ఇంత ఉద్రిక్తతకు దారితీసి ఉండేది కాదంటున్నారు. మున్సిపల్‌ అధికారుల్లో సమన్వయం లేకపోవడం వల్లే ఈ అంశం వివాదంగా మారిందని అంటున్నారు. మొత్తానికి అభివృద్ధికి గుర్తుగా నిలిచిన పైలాన్‌ తొలగింపు ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement