వ్యవసాయ మార్కెట్‌ల నిర్వహణ అస్తవ్యస్తం యార్డు ఆవరణలో పేరుకు పోయిన చెత్తాచెదారం ఆదాయం ఉన్నా.. అన్నదాతలకు తప్పని అవస్థలు ఆర్థిక శాఖ వద్ద ఏడాదిగా పెండింగ్‌లో బిల్లులు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో 202 వ్యవసాయ మార్కెట్లు ఉండగా అన్నింటా నిధుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా ఉద్యోగులు, సిబ్బంది వేతనాలతోపాటు యార్డుల నిర్వహణకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి బిల్లులు విడుదల కావడంలేదు. ప్రస్తుతం వరి కోతలు ఊపందుకుంటుండగా ధాన్యంతోపాటు పత్తి కూడా వచ్చి చేరుతోంది. దిగుబడులు తీసుకొచ్చిన రైతులకు తాగునీరు కూడ అందించలేని దీనస్థితిలో మార్కెట్‌లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
ఆదాయం ఉన్నా..
ఫీజుల రూపంలో మార్కెట్‌లకు ఆదాయం వస్తున్నా 24గంటల్లోగా ఆ సమ్మును ప్రభుత్వ ఖజనాకు జమచేస్తున్నారు. చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే ఉండడంతో ఉన్నతాధికారులు పర్యవేక్షించి జమచేయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆలస్యమైనా అందుకు గల కారణాలు చూపించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆదాయం రూపంలో వచ్చిన సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 37 మార్కెట్లు
ఉమ్మడి కరీంనర్ జిల్లాలో 37 వ్యవసాయ మార్కెట్‌లు ఉన్నాయి. అందులో అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 13, పెద్దపల్లిలో 9, కరీంనగర్‌లో 8, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7 మార్కెట్‌లు ఉన్నాయి. అందులో పనిచేసే ఉద్యోగులకు ఏడాదిగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు కూడా చాలా నెలలుగా పెండింగ్‌లో ఉండగా ఇటీవలే చెల్లించినట్టు తెలిసింది.
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లోనే పెండింగ్
మార్కెట్ ఉద్యోగుల వేతనాలు, యార్డు నిర్వహణ కోసం చేసిన ఖర్చుల బిల్లులను సకాలంలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు పంపించినా.. నెలల తర బడి అక్కడే పెండింగ్‌లో ఉంటున్నాయి. బడ్జెట్‌లో కేటాయించిన నిధులను సకాలంలో చెల్లిస్తే సీజన్‌లో దిగుబడులు వచ్చేసరికి అంతాసిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.


