అనుచరులకే దీపావళి ధమాకా! | - | Sakshi
Sakshi News home page

అనుచరులకే దీపావళి ధమాకా!

Nov 2 2026 12:11 AM | Updated on Nov 2 2026 12:11 AM

పెద్దపల్లి: నామినేటెడ్‌ పదవుల భర్తీపై అధికార కాంగ్రెస్‌లో సందడి నెలకొంది. ప్రస్తుత పాలకవర్గాల గడువు చివరిదశకు చేరుతుండటంతో కొత్త నియామకాలపై కసరత్తు వేగవంతమైంది. ఈ క్రమంలో నియామకాల ఫైల్‌ అధిష్టానానికి చేరినట్లు సమాచారం. దీపావళి పండుగలోగా కొత్త పాలకవర్గాల ప్రకటన వెలువడే అవకాశాలున్నాయనే ప్రచారంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్య నాయకులతో చర్చించి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. మెజారిటీ నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ పేర్ల ఖరారుపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

కీలక కమిటీలపై దృష్టి

రాజకీయంగా కీలకమైన, చైతన్యవంతమైన మండలం పెద్దపల్లి, సుల్తానాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. సుల్తానాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మినుపాల స్వరూప, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ఏడేలీ శంకర్‌ పేర్లకు సెక్రటేరియట్‌ ఆమోదం తెలపడమే ఆలస్యమని ముఖ్య నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సొంత మండలంలో కొత్తగా వ్యవసాయ మార్కెట్‌, పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు.

సుల్తానాబాద్‌ పీఏసీఎస్‌కు..

సుల్తానాబాద్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌) చైర్మన్‌ పదవికి దన్ననాయక్‌ దామోదర్‌రావు పేరు ఒక్కటేఉన్నట్లు సమాచారం. మంత్రి శ్రీధర్‌ బాబు ఆశీస్సులతో ఎమ్మెల్యే సహకారంతో చైర్మన్‌ దక్కనుందని అంటున్నారు. కీలకమైన పెద్దపల్లి, సుల్తానాబాద్‌ ప్రాంతాల్లో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, అనుచరులకు ప్రాధాన్యం దక్కే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.

కూర్పుపై ఉత్కంఠ

నామినేటెడ్‌ పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేయగా.. సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకుల అభిప్రాయాలు నియామకాల్లో కీలకం కానున్నాయి. డైరెక్టర్లు, వైస్‌ చైర్మన్‌ తుది జాబితాపై అధికారిక ప్రకటన వెలువడితేనే ఎవరికి ఏ పదవి దక్కనుందో స్పష్టత రానుంది. దీపావళి పండుగ నాటికి నామినేటెడ్‌ పదవులు ఎవరిని వరిస్తాయో? అనే ఉత్కంఠ కాంగ్రెస్‌ వర్గాల్లో నెలకొంది. దీపావళి తర్వాత మున్సిపల్‌, కార్పొరేషన్‌, గ్రామ పంచాయతీ కో ఆప్షన్‌ సైతం పూర్తి చేయనున్నట్లు సమాచారం.

నామినేటెడ్‌ పదవుల భర్తీపై కసరత్తు

కీలక కమిటీలపై ఆశావహుల గురి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement