కరీంనగర్ టౌన్: రైతుల సాగునీటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజాక్షేత్రంలో పోరాటం సాగిస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. నగరంలోని ఓ హోటల్లో ఆదివారం కమలాకర్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు కేటీఆర్ నేతృత్వంలో నవంబర్ 11 నుంచి 14 మధ్య రెండు రోజులపాటు బస్సుయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే బస్సుయాత్ర గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా సాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రతీకగా నిలిచిన దీక్షా దివస్‌ను పురస్కరించుకొని నవంబర్ 29న అలుగునూర్ లేదా నుస్తులాపూర్‌లో 50వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్ రావు, పుట్ట మధు, కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, దేవేందర్‌రెడ్డి, కోలేటి దామోదర్, జీవీ.రామకృష్ణారావు, తోట ఆగయ్య, కొండూరు రవీందర్ రావు, దావ వసంత, సిద్ధంవేణు, చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.
కేటీఆర్‌తో కలిసి ప్రాజెక్టుల సందర్శనకు బస్సుయాత్ర
29న అలుగునూర్‌లో 50వేల మందితో దీక్షా దివస్


