ఈగల్‌ చూస్తోంది..! | - | Sakshi
Sakshi News home page

ఈగల్‌ చూస్తోంది..!

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

● గంజాయి పెడ్లర్లపై నిరంతర నిఘా ● గ్రామస్థాయి వరకూ బలోపేతం

గోదావరిఖని: యువత, విద్యార్థి లోకాన్ని అస్థవ్యస్తం చేస్తున్న గంజాయి, డ్రగ్స్‌ సమూల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని రామగుండం పోలీస్‌ అధికారులు నిర్ణయించారు. సూత్రధారులతో పాటు పెడ్లర్లపై కఠిన చర్యలు, సరఫరా, రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ప్రతీ ఎన్‌డీపీఎస్‌ కేసును ఈగల్‌తో సమన్వయం చేయాలని నిర్ణయించారు. గురువారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌కు ఈగల్‌ బృందం చేరుకుని ఎన్‌డీపీఎస్‌ కేసులపై ఆరా తీసింది. కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నమోదైన కేసుల పురోగతి, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు స్థితి, నిందితుల కార్యకలాపాలు, సరఫరా మార్గాలను సమీక్షించారు. పెండింగ్‌కు గల కారణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతం, సాక్ష్యాధారాల సేకరణ, మూలాల అన్వేషణలో వృత్తిపర నైపుణ్యంతో వ్యవహరించాలని సూచించారు. ఎస్‌హెచ్‌వోలు, టాస్క్‌ఫోర్స్‌, ఈగల్‌ టీం సమన్వయంతో పనిచేయాలని, మాదకద్రవ్యాలపై వచ్చే సమాచారాన్ని విశ్లేషించి నెట్‌వర్క్‌పై ఏకకాలంలో దాడులు చేసి నిందితులకు చుక్కలు చూపించాలన్నారు. సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచుతూ చర్యలు చేపట్టనున్నారు.

సరఫరా చైన్‌ ఛేదనే లక్ష్యం

గంజాయి సరఫరా చైన్‌లో ప్రతీస్థాయిని గుర్తించి పెడ్లర్ల నుంచి ప్రధాన సరఫరాదారుల వరకు నెట్‌వర్క్‌ను ఛేదించేలా దర్యాప్తు చేపట్టనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ప్రదేశాలు, మార్గాలపై ప్రత్యేక నిఘా కొనసాగించనున్నారు.

యువతే లక్ష్యం

మత్తు పదార్థాల వినియోగం యువత ఆరోగ్యం, చదువు, ఉద్యోగం, కుటుంబ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సరదాగా మొదలై వ్యసనంగా మారుతోంది. యువతను లక్ష్యం చేసుకుని చేరవేసే గంజాయి, డ్రగ్స్‌ ముఠాలపై కఠిన చర్యలతో పాటు విద్యాసంస్థలు, హాస్టళ్లు, యువత ఎక్కువ సంచరించే ప్రాంతాల్లో అవగాహన పెంచడం కీలకమని పలువురు నిపుణులు అధికారులకు సూచిస్తున్నారు.

మూలాలపై నిఘా

కేవలం వినియోగదారులను పట్టుకోవడం సరిపోదని, సరఫరా చేసేవారు, మధ్యవర్తులు, ప్రధాన నె ట్‌వర్క్‌ను గుర్తించాలి. తనిఖీలు, సంబంధిత శాఖ ల సమన్వయంతో అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయడంతో పాటు వ్యసనానికి గురైనవారికి కౌన్సెలింగ్‌, పునరావాస సేవలు అందించనున్నారు.

స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌, కేసులు, అరెస్ట్‌లు

ఏడాది కేసులు కిలోలు విలువ(రూ.కోట్లలో) అరెస్ట్‌లు

2023 80 518.80 1.04 141

2024 95 52.70 0.1860 266

2025 121 262.72 1.27 373

2026 111 55.88 0.2926 243

కూకటివేళ్లతో పెకిలిస్తాం

గంజాయి మూలాలను కూకటి వేళ్లతో పెకిలిస్తాం. ఈగల్‌ టీం, టాస్క్‌ఫోర్స్‌, నార్కొటిక్‌ విభాగాల సమ న్వయంతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో విక్ర యాలు, వినియోగాన్ని కట్టడి చేస్తాం. పెడ్లర్ల వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాం. ప్రజలు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

– అంబర్‌ కిశోర్‌ ఝా, సీపీ, రామగుండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement