పోలీస్ అధికారుల పోస్టింగుల నుంచి కేసుల నమోదు వరకూ పెత్తనం నాయకుల సిఫారసులతోనే శాంతిభద్రతల విభాగానికి.. మాట వినని అధికారులకు స్థానచలనం.. లూప్‌లైన్ విధులు బాధితుల ఫిర్యాదులకు బ్రేక్.. ఒత్తిళ్లతో ప్రత్యర్థులపై కేసులు నిజాయతీ పోలీస్ అధికారులకు అందని కీలక పోలీస్‌స్టేషన్లు
సాక్షి, పెద్దపల్లి: శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీ.. ఖద్దర్ కనుసన్నల్లో పనిచేయాల్సి వస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమేనన్న సూత్రానికి తూట్లు పొడుస్తూ కొందరు ప్రజాప్రతినిధులు పోలీసు వ్యవస్థపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఫిర్యాదుల స్వీకరణ నుంచి కేసుల నమోదు, పోస్టింగులు, బదిలీల వరకూ రాజకీయ జోక్యం పెరుగుతోందనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమకు అనుకూలంగా పనిచేసే అధికారులకు కీలక పోస్టింగులు ఇప్పించుకోవడం.. మాట వినని వారిని బదిలీ చేయించడం పరిపాటిగా మారిందనే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది. ఫలితంగా ప్రజలకు న్యాయం చేయాల్సిన కొందరు పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులను ఆశ్రయించిన బాధితులకు న్యాయం దక్కాల్సిందిపోయి, రాజకీయ పలుకుబడి ముందు వారిగోడు వినేవారే కరువవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనను ఒకరు వేధిస్తున్నాడని ఓ మహిళ ఓ ఠాణా పరిధిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. ఫిర్యాదు స్వీకరించకుండా ఇరువర్గాలు బయట మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. తనపైనే ఫిర్యాదు చేస్తారా? అంటూ ఆ నాయకుడు బాధితురాలితోపాటు సహకరించిన మరొకరిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వివాదం చినికిచినికి గాలివానగా మారి చివరకు ఆ వ్యక్తిపైనే హత్యాయత్నం కేసు నమోదైనట్లు తెలిసింది.
రాజీ కుదిరినా.. రచ్చ తప్పడం లేదు!
ఇటీవల రాఘవాపూర్‌లో రెండువర్గాల మధ్య ఘ ర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలూ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. ఏసీపీ జోక్యం చేసుకొని వారి మధ్య రాజీ కుదిర్చినట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో సీఐ ఉద్దేశపూర్వకంగా తమపై దాడి చేశారని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇలా జిల్లాలోని పలు ఠాణాల్లో రాజకీయ ఒత్తిళ్లతో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీక రించడం లేదని, కొన్ని సందర్భాల్లో ఫిర్యాదుదారులపైనే ఎదురుకేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోస్టింగుల వెనుక సిపారసు లేఖలు?
పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీలక పోలీస్‌స్టేషన్లలో ఇన్‌స్పెక్టర్ల పోస్టింగుల వ్యవహారం చర్చనీ యాంశంగా మారుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, వారికుటుంబ సభ్యులు, ము ఖ్య అనుచరులు పోలీసు అధికారుల నియామకా ల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.


