క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 30 2026 12:15 AM | Updated on Oct 30 2026 12:15 AM

క్లుప్తంగా

గోదావరిఖని నుంచి శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక బస్సు

గోదావరిఖనిటౌన్‌: గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక యాత్ర సూపర్‌ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ కవిత గురువారం తెలిపారు. శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల దర్శనం కోసం వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవంబర్‌ 3న రాత్రి 7 గంటలకు గోదావరిఖని నుంచి బయలుదేరి, 5న ఉదయం గోదావరిఖనికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ యాత్రకు ప్యాకేజీ చార్జీగా ఒక్కొక్కరికి రూ. 2,500 నిర్ణయించామని, కనీసం 30 మంది ప్రయాణికులు బృందంగా ఏర్పడితే వారు కోరుకున్న ప్రాంతం నుంచే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు నచ్చిన రకం బస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. యాత్రల వివరాలు, టికెట్‌ రిజర్వేషన్లకు 70135 04982, 73828 47596 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ముగ్గురు దొంగల అరెస్ట్‌

జూలపల్లి: మండలంలోని కుమ్మరికుంట, పెద్దాపూర్‌ గ్రామాల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మల్లేశ్‌ తెలిపారు. బంగారు, వెండి ఆభరణాలు ఎతుకెళ్లి మహారాష్టలో విక్రయించినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ ఏడాది జూన్‌ 15న కుమ్మరికుంటలో వడ్లూరి సాగర్‌ ఇంట్లో బంగారు ఆభరణాలను ఎక్కిరాల రాకేశ్‌, కళ్లెపెల్లి జాన్‌, సెప్టెంబర్‌ 21న పెద్దాపూర్‌లో కొత్తపెల్లి పద్మ ఇంట్లో బంగారు చెవి కమ్మలు, వెండి పట్టీలు, అక్టోబర్‌ 14న కల్లెపెల్లి అంజయ్య ఇంట్లో చెవి కమ్మలు, ఉంగరం, గొలుసును కళ్లెపెల్లి జాన్‌, సాయిచరణ్‌ ఎత్తుకెళ్లారు. దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకుని ముగ్గురిని కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ఇళ్లను విడిచి వెళ్లే వారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలపాలని సూచించారు.

‘యువశక్తి’ సేవలు

అభినందనీయం

ధర్మారం: మండలంలోని పత్తిపాక గ్రామంలో యువశక్తి యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని వివిధ రాష్ట్రాల డీవైఏలు అన్నారు. గురువారం పత్తిపాక గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు సంఘం ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను అధికారులకు వివరించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, అసోసియేషన్‌ సేవలు ఆదర్శనీయమని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో డీవైఏ గోలి తిరుపతిరెడ్డి, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, కేరళం, జమ్మూకశ్మీర్‌ డీవైవోలు, విండో చైర్మన్‌ నోముల వెంకటరెడ్డి, అసోసియేషన్‌ ప్రతినిధులు మహేశ్‌, అధ్యక్షుడు జిల్లాల అనిల్‌, సెక్రటరీ అజాంత్‌ వేణు, నరేందర్‌, అకౌంటెంట్‌ కిరణ్‌, సర్పంచు మాందాల శ్రావణిహరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫుడ్‌ సేఫ్టీ అధికారి తనిఖీ

ధర్మారం: మండలకేంద్రంలో గురువారం జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి తుమ్మల అరవింద్‌రెడ్డి కిరాణ దుకాణం, రెస్టారెంట్లను తనిఖీ చేశారు. కిరాణ దుకాణంలో పలు ఆహార పదార్థాలు, నూనెల నమూనాలను సేకరించారు. అనంతరం రెస్టారెంట్‌లో వండిన ఆహార పదార్థాలు, వాడుతున్న నూనెలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేకరించిన నమూనాలను కల్తీ నిర్ధారణ కోసం హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. ఆహార పదార్థాలు కల్తీగా తేలితే యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ దుకాణ యజమాని ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌ తీసుకోవాలని లేకుంటే చర్యలు తప్పవన్నారు. ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌ లేని వారికి నోటీసులు అందించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement