● ప్రమాద బాధితులకు భరోసా ● రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం
రామగిరి: రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో ఓ కుటుంబాన్ని ఆందోళనలోకి నెట్టే విపత్తు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే వైద్య ఖర్చులు ఎలా భరించాలన్న ఆందోళన పేద, మధ్యతరగతి కుటుంబాలను వెంటాడుతాయి. ఈనేపథ్యంలో డబ్బుల్లేక వైద్యం ఆలస్యం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకం ప్రమాద బాధితులకు అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద బాధితులకు రూ.1.50 లక్షల వరకు, ఏడురోజుల పాటు నగదు రహిత వైద్యం పొందే అవకాశం ఉంది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో 15 ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఆపదలో అండగా..
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి వెంటనే వైద్యం అందించడం ప్రాణాలు కాపాడటంలో కీలకం. చికిత్స ఖర్చుల భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేయడం ప్రమాదకరం. ఈ నేపథ్యంలో పీఎం రాహత్ పథకం కింద అర్హులైన బాధితులకు నిబంధనల ప్రకారం నగదు రహిత చికిత్స అందుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సాయం కోసం 112కు కాల్ చేయాలి. క్షతగాత్రులను వీలైనంత త్వరగా సమీపంలోని పథకం గుర్తింపు పొందిన ఆస్పత్రికి తరలించేలా సహకరించాలి. పథకం కింద చికిత్స పొందేందుకు ఆస్పత్రి సిబ్బందిని సంప్రదించి అవసరమైన వివరాలు అందించాలి. పోలీసు, వైద్య సిబ్బందికి సహకరించాలి. అత్యవసర వైద్యం అందించడంలో జాప్యం జరగకుండా చూడాలి.
పేద కుటుంబాలకు ఊరట
కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆదాయం నిలిచిపోవడంతోపాటు వైద్య ఖర్చుల భారం పెరుగుతుంది. అప్పు చేసి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి సమయంలో నగదు రహిత వైద్య సదుపాయం బాధిత కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరటనిస్తుంది. పథకంపై అవగాహన ఉంటే ఆపద సమయంలో సరైన సాయం పొందేందుకు వీలుంటుంది. గ్రామాలు, పట్టణాల్లో రవాణా, పోలీసు, వైద్య సిబ్బంది సమన్వయంతో పథకంపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. వాహనదారులు, ఆటో డ్రైవర్లు, యువతకు 112 అత్యవసర సేవల గురించి తెలియజేయాలి.
సద్వినియోగం చేసుకోవాలి
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే 112కు సమాచారం అందించి, బాధితులను సమీపంలోని పీఎం రాహత్ పథకం కింద ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రులకు తరలించేలా సహకరించాలి. ఈ పథకంపై ప్రజలు అవగాహన పెంచుకుని, పోలీసు, వైద్య సిబ్బందికి సహకరించాలి.
– అంబర్ కిషోర్ ఝా,
రామగుండం పోలీస్ కమిషనర్


