రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో మూతపడిన 62.5 మెగావాట్ల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన జెన్కో స్థలంలో 800 మెగావాట్స్ పర్ హవర్ (ఎండబ్ల్యూహెచ్) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(బీఈఎస్ఎస్)కు సంబంధించి ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ఆదివారం స్థల పరిశీలన చేసినట్లు సమాచారం. ఆ స్థలంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదేస్థలంలో విద్యుత్‌ను స్టోర్ చేసేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈనెల 23న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే 24 ఎకరాల అనువైన స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు. ఇందులో స్థానిక జెన్కో ఉన్నతాధికారి ఏ, బీ కాలనీలతోపాటు బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థలాన్ని వారికి చూపించినట్లు తెలిసింది. 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి అదనంగా 200 ఎండబ్ల్యూహెచ్ సామర్ధ్యంతో నాలుగు యూనిట్లను బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం కోసం స్థాపించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


