రాజారాంపల్లిలో యువకుని దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

రాజారాంపల్లిలో యువకుని దారుణ హత్య

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

వెల్గటూర్‌: పాత కక్షలతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన బొంతు మల్లయ్య, శివరాత్రి మల్లేశ్‌ కుటుంబాలు వలస వచ్చి.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలకేంద్రంలో మల్లయ్య కుటుంబం, జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో మల్లేశ్‌ కుటుంబం నివాసం ఉంటోంది. మల్లయ్య భార్యతో.. మల్లేశ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరు కుటుంబాల మధ్య కొద్దిరోజులుగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మల్లయ్య కుమారుడు సంతోష్‌ తన తల్లితో వివాహేతర సంబంధం విషయమై మల్లేశ్‌ను ప్రశ్నించాడు. దీంతో సంతోష్‌పై మల్లేష్‌ పగ పెంచుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి సంతోష్‌ (17) ఒంటరిగా రాజారాంపల్లికి రాగా పాతకక్షలతో శివరాత్రి మల్లేష్‌ ప్రోత్సాహంతో అతని కొడుకు అనిల్‌ సంతోష్‌పై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్‌ కుమార్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని పురాణిపేటకు చెందిన బోరుగల్ల లక్ష్మణ్‌ (54) చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. లక్ష్మణ్‌ ఈనెల 17న సాయంత్రం ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిసి ్థతి విషమంగా ఉండటంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్‌ తెలిపారు.

భార్య మందలించిందని రైతు ఆత్మహత్య

శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన రైతు పొలం విషయంలో భార్యతో గొడవపడి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పండగపూట విషాదం నింపింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. కరీంపేటకు చెందిన నాంపెల్లి సాంబయ్య(55) పొలం ఎండిపోతుండడంతో బాధతో ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అతడి భార్య శోభ, కుమారులు అజయ్‌, శ్రావణ్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని రాత్రి 10.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. మద్యం తాగి వచ్చిన భర్తను చూసి శోభ పండుగపూట ఎందుకు తాగావని ప్రశ్నించింది. పొలం ఎండిపోతుంటే బాధతో మద్యం తాగానని సాంబయ్య చెప్పి రాత్రి మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయి పొలం సమీపంలోని వాగు పక్కన చెట్టుకు ఉరేకున్నాడు. సాంబయ్య కోసం కొడుకులు, మరో వ్యక్తితో కలిసి వెతికారు. అర్ధరాత్రి సమయంలో వాగు పక్కన చెట్టుకు సాంబయ్య వేలాడుతూ కనిపించాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.

మాది చేతల ప్రభుత్వం : మంత్రి శ్రీధర్‌బాబు

గోదావరిఖని: మాటలకు పరిమితం కాదని, ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. సోమవారం స్థానిక జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ముందస్తు దసరా ఉత్సవాల్లో వారు మాట్లాడారు. సింగరేణి కార్మికుల ప్రధానమైన మూడు సమస్యలు సమస్యలు పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. సొంతింటి కల నిజం చేస్తామని, అతిత్వరలో రామగుండం కేంద్రంగా ప్రారంభిస్తామన్నారు. మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిస్తామని తెలిపారు. రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి రాజ్‌ఠాకూర్‌ ఆలోచిస్తున్నారన్నారు. 800మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు ఈప్రాంతానికి రాబోతోందని తెలిపారు. ఉపాధి అవకాశాలు పెంచాలని, ఇందిరమ్మ ఇళ్లు వచ్చినా స్థలం లేదని, సింగరేణి, రెవెన్యూ భూములను కేటాయించి ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తామని తెలిపారు. పేదవారందరికీ ఇళ్లు అందజేస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉందని, మంచినీరు, విద్యుత్‌, సాగునీటి సమస్య, గృహావసరాల కోసం పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో జువెల్లరీ షాపు దగ్ధం

జమ్మికుంట: పట్టణంలోని ఓ జువెల్లరి షాపు షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని కాసుల కిరణ్‌, మహేశ్‌, భాస్కర్‌ ముగ్గరు అన్నదమ్ములు శ్రీవిజయలక్ష్మి జువెల్లరి వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. సోమవారం షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యుత్‌ మీటర్‌ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఫైర్‌ స్టేషన్‌, పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. షాపులోని ఫర్నిచర్‌, వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ఘటపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని టౌన్‌ సీఐ రామకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement