కార్పొరేషన్‌లో ‘షాడో’ పాలన | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌లో ‘షాడో’ పాలన

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం కార్పొరేషన్‌లోని 21, 22, 23వ డివిజన్‌లలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ల మధ్య అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో రెండు డివిజన్లుగానే ఉన్న ఈ ప్రాంతాన్ని ఇటీవల మూడు డివిజన్లుగా విభజించారు. భౌగోళిక మార్పుల తర్వాత ముగ్గురు ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లోపించి, నిత్యం ఆధిపత్య పోరు సాగుతోంది. కార్యక్రమం నిర్వహించినా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ భర్త, తనకు సంబంధం లేనిమరో డివిజన్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఆధిపత్యం చెలాయించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది స్థానిక డివిజన్‌ కార్పొరేటర్‌ల స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమే కాకుండా వారి మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తోంది.

దిగజారుతున్న ప్రతిష్ట

ఆధిపత్య పోరుతో కొద్దిరోజులుగా కార్పొరేటర్ల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. ప్రొటోకాల్‌తో కూడిన అధికారిక కార్యక్రమాల్లో సైతం వీరు ఉత్సాహంగా పాల్గొనకపోగా, పరస్పరం ఆధిపత్యం ప్రదర్శించేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. కార్పొరేటర్ల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంతో ప్రజాసమస్యలు , అభివృద్ధి మూలనపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీకి నష్టం

ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకోవడమే సమస్య పునరావృతం కావడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రజాప్రతినిధుల స్వార్థ రాజకీయంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని డివిజన్‌ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ముగ్గురు కార్పొరేటర్ల అంతర్గత వివాదం పార్టీ ప్రతిష్టను దిగజారుస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే వెంటనే రంగంలోకి దిగాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యే, మేయర్‌ చొరవ తీసుకుని ఈ మూడు డివిజన్‌ల కార్పొరేటర్ల భర్తల ఆధిపత్యానికి చెక్‌ పెట్టి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా నిరసన తప్పదని హెచ్చరిస్తున్నారు.

అధికార పార్టీ కార్పొరేటర్ల భర్తల ఆధిపత్యపోరు

‘మూడు’ ముక్కలాటగా డివిజన్‌ల రాజకీయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement