వేములవాడరూరల్: వేములవాడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగు అనిల్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతిచెందాడు. అనిల్‌కుమార్ స్వగ్రామం యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. 2008 బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ డ్రైవర్‌గా విధుల్లో చేరి స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా ఎది గారు. గత రెండేళ్లుగా వేములవాడ అగ్నిమాపక అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
27న ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు
పెద్దపల్లి: కరీంనగర్ ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలు ఈనెల 27న సుల్తానాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు. ఎస్‌ఎన్‌ఆర్ స్పోర్ట్స్ అకాడమీలో అండర్–14, అండర్–17 బాలబాలికల పోటీలు జరుగుతాయన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అర్హత గల క్రీడాకారులు హాజరు కావాలన్నారు. వివరాలకు 93965 40067, 99898 48858, 96183 36976 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
తాగునీటి నాణ్యత తనిఖీ
రామగుండం: మంచిర్యాల, బెల్లంపల్లితోపాటు రామగుండం రైల్వేస్టేషన్లలో శుక్రవారం తాగునీటి నాణ్యతను తనిఖీ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. సెప్టెంబర్ 9 నుంచి 15వ తేదీలలో మధ్య ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్‌లో నిర్దేశించిన ప్రమాణాలకు భూగర్భ జలాలు, పురపాలక నీటి సరఫరా, నిల్వనీరు, క్లోరినేషన్, పంపిణీ వ్యవస్థలపై సమీక్షించామన్నారు. ఈక్రమంలో రామగుండంలో 93, మంచిర్యాలలో 105, బెల్లంపల్లిలో 57 నమూనాలను సేకరించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం రామగుండంలో నీటి నాణ్యత పరీక్షంచగా.. కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్), హైడ్రోజన్ పొటెన్షియల్ (పీహెచ్)స్థాయిలు పరిమితులకు లోబడి ఉన్నట్లు నిర్ధారించినట్లు ప్రకటించారు.
పెట్రోల్‌లో నీళ్ల కల్తీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో శుక్రవారం పెట్రోల్‌కు బదులు నీళ్లు పోశారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు. అఖిల్ అనే యువకుడు తన బైక్‌లో రూ.200 విలువైన పెట్రోల్‌ను పోయించుకున్నాడు. బంకు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే వాహనం ఆగిపోయింది. అనుమానం వచ్చిన వాహనదారుడు ట్యాంక్‌లోని ఇంధనాన్ని బాటిళ్లలోకి తీసి చూడగా అందులో సగానికి పైగా నీరు కలిసి ఉండటం కనిపించింది. వెంటనే అతడు బంకు వద్దకు చేరుకుని నిర్వాహకులను నిలదీశాడు. అక్కడికి చేరుకున్న ఇతర వినియోగదారులు కూడా బంకు యాజమాన్యం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కల్తీ పెట్రోల్ కారణంగా తమ వాహనాలు దెబ్బతింటున్నాయని, అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి బంకులపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేశారు.


