గోదావరిఖని: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా సాగేలా ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. పోలీస్, సింగరేణి, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, వైద్య, ఆరో గ్య, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, ఫిషరీస్ తదితర శాఖల అధికారులతో తన కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన సమన్వయ సమయంలో సీపీ మాట్లాడారు. గతేడాది ఎదురైన సమస్యలు, లోపాలను సమీక్షించి, ఈసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాల్లో నీటిలోతు, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రక్షణ సిబ్బంది, గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని అన్నారు. పారిశుధ్యం నిర్వహణ, తాగునీరు, లైటింగ్, రోడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ వైర్లు, స్తంభాలు, తాత్కాలిక కనెక్షన్లను పరిశీలించి ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆన అన్నారు. అదనపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, సింగరేణి ఆర్‌జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఏసీపీలు నాగేంద్రగౌడ్, రమేశ్, వెంకటేశ్వర్లు, సీఐలు ఇంద్రసేనారెడ్డి, కృష్ణకుమార్, ప్రసాద్‌రావు, నవీన్‌కుమార్, ఎస్‌ఐ భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గ్రీవెన్స్‌డేలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతీ ఫిర్యాదుదారుతో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


