కమాన్‌పూర్: గుండారం రిజర్వాయర్ వద్ద గణపతి విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు ఇంకా కానరావడం లేదు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ గ్రామాల్లో నెలకొల్పిన వినాయక విగ్రహాల నిమ్మజ్జనం ఈనెల 23న నిర్వహించనున్నారు. ఈమేరకు ఆయ మండపాల నిర్వాహకులు ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. మరోవైపు.. ఏటా గుండారం రిజర్వాయర్‌లో సుమారు వంద వినాయక విగ్రహాల వరకు నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం సందర్భంగా భక్తులు, నిర్వాహకులకు ఇబ్బందులు కలుగకుండా రిజర్వాయర్ కట్ట, దారి వెంట వీధిలైట్లు, దారిపై గుంతల పూడ్చిడం వంటి పనులు చేపట్టాల్సి ఉన్నా.. నామమాత్రంగానే పనులు చేశారని విమర్శలు వస్తున్నాయి. నిమజ్జనం చేయడానికి వచ్చేవాహనాలకు, భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.


