గోదావరిఖని: ప్రేమ పేరిట వేధింపులు తాళలేకనే తాండ్ర అక్షితరాణి(20) ఆత్మహత్య చేసుకున్నట్లు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఇందుకు బాధ్యులైన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోలెనిల్‌నగర్‌కు చెందిన అక్షితరాణి మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పాలిటెక్నిక్‌లో డిప్లొమా చదివింది. ఆ సమయంలో లెక్చరర్ జెట్టి నవీన్ ప్రేమ పేరిట వేధించాడు. ఆమె కుటుంబసభ్యులు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో మూడేళ్ల క్రితం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుంచి గోదావరిఖని లెనిన్‌నగర్‌కు కుటుంబం మకాం మార్చింది. ఆ తర్వాత ఆర్జీ–వన్‌లోని జీడీకే–2గనిలో అక్షితరాణి అప్రెంటిషిప్ చేసింది. ఆ సమయంలోనూ ఓవర్‌మెన్ బొమ్మకంటి రవికుమార్ కూడా ఆమెను ప్రేమ పేరితో వేధిస్తూ వెంటపడ్డాడు. చదువును మధ్యలోనే ఆపేసిన ఆమె గోదావరిఖని గౌతమినగర్‌లో ఓ సెంటర్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. ఈక్రమంలో ఈనెల 12న ఉదయం తండ్రి కంప్యూటర్ సెంటర్ వద్ద దింపి వెళ్లాడు. సాయంత్రం ఆయన ఫోన్ చేయగా, తాను గోదావరిఖని బస్‌స్టాండ్ వద్ద ఉన్నానని, ఇంటికి వస్తున్నానని సమాధానం ఇచ్చింది. అదేరోజు రాత్రి లెక్చరర్ నవీన్.. ఆమె తండ్రి ఐజాక్‌కి ఫోన్‌చేసి, అక్షితరాణి పురుగుల మందు తాగిందని సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే తన కారులో తండ్రి వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె నోటినుంచి నురుగు రావడం, వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు అదేకారులో వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 13న మృతి చెందింది. అక్షితరాణి తండ్రి ఫిర్యాదు మేరకు మృతికి కారణమైన ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వివరించారు.
కారకులపై చర్య తీసుకోవాలి
అక్షితరాణి మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో దళిత సంఘాలు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట రాజీవ్ రహదారిపై సోమవారం శవంతో ధర్నా నిర్వహించాయి. ఇన్‌చార్జి ఏసీపీ ప్రవీణ్‌కుమార్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు ఆందోళనకారులను శాంతింపజేశారు.


