జ్యోతినగర్: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ మరో ముందడుగు వేసింది. వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత మట్టి గణేశ్ విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ మట్టి విగ్రహాల పంపిణీని శుక్రవారం ప్రారంభించింది. రామగుండం ప్రాంతీయ కార్యాలయం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(టీజీపీసీబీ) సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాల నిమజ్జనంతో నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను వినియోగించడం పర్యావరణానికి మేలు చేస్తుందని కార్యక్రమ నిర్వాహకులు వివరించారు. మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోవడంతోపాటు జలజీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదపడతాయని వారు తెలిపారు. పర్యావరణహిత గణేశ్ ఉత్సవాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రతిఒక్కరూ మట్టివిగ్రహాలను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని నిర్వాహకులు సూచించారు.


