గోదావరిఖని: కొత్తగూడెంలో మారుపేర్ల సమస్యపై కమిటి కీలకభేటీ కానున్న నేపథ్యంలో అందరి దృష్టి కార్పొరేట్ కార్యాలయంపై పడింది. ఇటీవల అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మారుపేర్లతో ఉన్న కార్మికుల డిపెండెంట్లు 128 మంది ఉన్నారని పేర్కొన్నారు. మానవీయ కోణంలో పరిష్కరిస్తామని, దీనిపై కమిటీ వేశామని, కమిటి నిర్ణయం తీసుకున్నవెంటనే మారుపేర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రకటించారు. సింగరేణిలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మారుపేర్ల సమస్యకు పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడుతోంది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో సమావేశం కానుంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నకేసులు, కార్మికుల సర్వీస్ రికార్డులు, వారసత్వ ఉద్యోగాలకు ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
1997 నుంచి సమస్య
సింగరేణిలో అధికారిక రికార్డుల్లో ఒకరి పేరు ఉండగా.. వారి స్థానంలో మరొకరు విధులు నిర్వహించిన సందర్భాలు గతంలో చోటుచేసుకున్నాయి. సమస్య 1997 నుంచి కొనసాగుతున్న పాత సమస్యగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో వెల్లడించారు. ప్రస్తుతం సింగరేణిలో సుమారు 90 వేల మంది ఉద్యోగులు ఉండగా.. మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న వారు 128 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. గతంలో ఈ వ్యవహారంపై 45 మంది అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
వారసత్వ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం
మారుపేర్ల సమస్య కేవలం ప్రస్తుత కార్మికులకే పరిమితం కాలేదు. వారి పిల్లలు, కుటుంబ సభ్యులపై కూడా దీని ప్రభావం పడుతోంది. ముఖ్యంగా కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్‌కు గురైనప్పుడు లేదా మరణించిన సందర్భాల్లో డిపెండెంట్, వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు పేర్లలో తేడాలు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. విజిలెన్స్ విచారణలు, సర్వీస్ రికార్డుల్లో పేర్ల వ్యత్యాసాలు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ తదితర అంశాల కారణంగా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
భట్టి ప్రకటనతో కొత్త ఆశలు
సమస్యపై ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టమైన హామీ ఇవ్వడంతో బాధిత కార్మిక కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరిస్తామని, ఏ ఒక్క అధికారిపైనా.. బాధ్యత పడకుండా కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
నేటి భేటీపై ఉత్కంఠ
కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో శుక్రవారం జరగనున్న కమిటీ సమావేశంపై సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఆసక్తి నెలకొంది. ఇన్నేళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న 128 మంది కార్మికుల విషయంలో కమిటీ ఎలాంటి సిఫార్సులు చేస్తుంది? పేర్ల మార్పిడికి మార్గం సుగమం చేస్తుందా? పెండింగ్‌లో ఉన్న వారసత్వ ఉద్యోగాల కేసులకు పరిష్కారం లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏఐటీయూసీ నుండి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, ప్రాతినిధ్య సంఘం నుంచి నాయకులు, యాజమాన్యం నుంచి కార్పొరేట్ సీపీపీ జీఎం, జీఎం పర్సనల్, జీఎం వెల్ఫేర్, లా ఏజీఎం భేటీ కానున్నారు. సమావేశంలో మారుపేర్ల సమస్య ఓకొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
నేడు కొత్తగూడెంలో కమిటీ కీలక భేటీ
హాజరుకానున్న గెలిచిన సంఘాలు


