● నేటి నుంచి ఆంధ్రకు ప్రత్యేక రైళ్ల రాకపోకలు ప్రారంభం
● రైల్వేలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రాంతీయ వివక్ష
రామగుండం: ప్రతీ పండుగకు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ముందుగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈనెల 14న వినాయకచవితి పండుగ పురస్కరించుకొని ఈనెల 11వ తేదీ నుంచే ఆంధ్రకు వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించడం కొసమెరుపు. ఇందులో చర్లపల్లి–కాకినాడటౌన్ (ఇరువైపుల), చర్లపల్లి–తిరుచానూర్ (ఇరువైపుల), గుంటూరు–వికారాబాద్ (ఇరువైపుల) ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించారు. అదే తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, నిజామాబాద్, కాగజ్‌నగర్, భద్రాచలం వైపు మాత్రం ఎలాంటి ప్రత్యేక రైళ్లను ప్రకటించకపోవడంతో రైల్వేశాఖ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ పండుగ సమయాల్లో సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాల ప్రజలు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రత్యేక రైళ్లు నడిపించకపోవడంతో ఉన్న రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటాయి. దీనిపై పాలకులు సీరియస్‌గా పరిగణించి రైల్వే మంత్రిత్వశాఖతో మాట్లాడి సత్వరమే పండుగ ప్రత్యేక రైళ్లను నడిపించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలంగాణలోనే ఉన్నా..
దక్షిణ మధ్య రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం 1966 అక్టోబర్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ (సికింద్రాబాద్)లోనే ఉన్నా తెలంగాణ రాష్ట్ర పండుగలపై ప్రత్యేక రైళ్లను నడిపించడంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం బాధాకరం. ఇటీవల ద.మ.రైల్వే జోన్ రెండుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భవించినప్పటికీ తెలంగాణ జోన్ నుంచి ఆంధ్రకు ప్రత్యేక రైళ్లను నడిపించడం చర్చనీయాంశంగా మారింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక రైళ్లను ప్రకటించలేదు. ఏదేమైన పండుగలకు, రద్దీ సీజన్లలో ప్రత్యేక రైళ్ల ఏర్పాటుపై పాలకులు రైల్వే యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


