నిఘా నేత్రాలపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నిఘా నేత్రాలపై నిర్లక్ష్యం

Sep 5 2026 7:07 AM | Updated on Sep 5 2026 7:07 AM

● అక్రమాలకు రహదారిగా పార్వతీ బ్యారేజీ ● అసాంఘిక కార్యకలాపాలకూ అడ్డా

మంథని: పెద్దపల్లి – మంచిర్యాల జిల్లాలను కలిపే బ్యారేజీ – వంతెనపై నిఘా నేత్రాలు లేవు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. మంథని నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులకు వెళ్లాలంటే గోదావరిఖని వద్ద ఉన్న గోదావరి వంతెన నుంచి రాకపోకలు సాగేవి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మంథని మండలం సిరిపురం వద్ద గోదావరినదిపై నిర్మించిన వంతెన కమ్‌ బ్యారేజీతో మంచిర్యాల జిల్లా సరిహద్దు ఆవలి వైపు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. బ్యారేజీ – వంతెన నుంచి కిష్టాపూర్‌, జైపూర్‌, చెన్నూర్‌, మంచిర్యాల మీదుగా మహారాష్ట్ర వైపు సులభంగా వెళ్లేందుకు వీలవుతుంది. నిఘాలేక అక్రమ రవాణాకూ రాజమార్గమైంది.

అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన హైకోర్టు న్యాయవాదులైన వామన్‌రావు –నాగమణి దంపతులను హత్యచేసిన కేసులో నిందితులు హత్యకు వినియోగించిన కత్తులను ఈ బ్యారేజీలోనే పడవేశారు. ఈ దారి గుండానే మహారాష్ట్రకు పారిపోయారు. జిల్లాలోని రేషన్‌ దుకాణాల ద్వారా సేకరించిన సబ్సిడీ బియ్యం సైతం ఇదే రహదారి గుండా రవాణా అవుతోంది. అక్రమంగా తరలుతున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు వంతెన వద్ద పట్టుకున్న సంఘటనకు ఇందుకు ఉదాహరణ.

నిఘా నుంచి తప్పించుకునేందుకు..

ఇసుక అక్రమ రవాణా, గంజాయి, గుట్కా లాంటి మత్తు పదార్థాలను తరలించేందుకు కూడా నిఘా నేత్రాల నుంచి తప్పించుకునేందుకు అక్రమార్కులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. నిరంతరం నిఘా ఉండాల్సిన ఈవంతెనపై కనీసం ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ప్రాజెక్టుకు సమీపంలోని పంప్‌హౌస్‌ డెలివరీ సిస్టం, కార్యాలయం వద్ద ఒక సీసీ కెమెరా ఉంది. పాజెక్టు భద్రతకు అధికారులు ఏర్పాటు చేసుకున్నారు. గోదావరిఖని వంతెన దాటిన తర్వాత ఇందారం వద్ద చెక్‌ పోస్టు ఉండటంతో పార్వతీ బ్యారేజీ మీదుగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నిఘా నేత్రాలేవి..?

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని చెబుతున్న పోలీసు యంత్రాంగం.. ఈ బ్యారేజీపై నుంచి వెళ్లే వాహనాల గుర్తింపునకు నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అనేక సంఘటనలు చోటుచేసుకొని పోలీస్‌లకు సవాల్‌గా మారినా.. సీసీ కెమెరాల ఏర్పాటులో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. మంథని–గోదావరిఖని ప్రధాన రహదారిలో గుంజపడుగు దాటిన బ్యారేజీకి సమీపంలో ఓ ఇంటి యజమాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకన్నారు. బ్యారేజీ దాటాక కిష్టాపూర్‌ మూల మలుపు వద్ద మరోవ్యక్తి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరానే ఆధారమవుతోంది. ఒకవేళ ఆ కెమెరాలు కూడా పనిచేయకపోతే అత్యవసర సమయాల్లో గుర్తింపు ప్రశ్నార్థకంగానే ఉంది.

చెక్‌పోస్టులు పెట్టొచ్చు?

బ్యారేజీ.. వంతెన రెండు జిల్లాల రవాణాకు ఉపయోగపడుతుండడంతో అక్రమాలను అరికట్టడానికి చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెక్‌పోస్టు దాటి వెళ్లడానికి అక్రమార్కులు భయపడే అవకాశం ఉంటుందని, పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement