గోదావరిఖని: ఆపరేషన్ చబుత్ర పేరిట పారిశ్రామి క ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ, వన్‌టౌన్, ఎన్టీపీసీ పోలీసులు అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు.
పలు పరిశ్రమలు.. పొరుగు రాష్ట్రాల కార్మికులు
పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన యువత ఎక్కువగా వలస వస్తున్నారు. సింగరేణి ఓబీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్టీపీసీ కొత్త ప్లాంట్ నిర్మాణంలో ఎక్కువగా పనిచేస్తున్నారు. అనూహ్య ఘటన జరిగితే రాష్ట్రస్థాయిలో సంచలనంగా మారడంతో పోలీసులు ముందస్తుగా జల్లెడ పడుతున్నారు. ప్రధానంగా జనసంచారం అధికంగా ఉండే గోదావరిఖని, ఎన్టీపీసీ, ఫెర్టిలైజర్‌సిటీ, రామగుండం రైల్వేస్టేషన్ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. నాలుగు రోజులుగా ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
మాదక ద్రవ్యాల కట్టడికి చర్యలు
మాదకద్రవ్యాల కట్టడికీ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. నార్కొటిక్ డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వావహనదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మొబైల్ పెట్రోలింగ్ విస్తృతంగా చేశారు. డాగ్ స్క్వాడ్స్‌నూ రంగంలోకికి దింపారు.
ఆపరేషన్ బస్టాండ్.. రైల్వేస్టేషన్..
జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడం, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు రావడంలో గోదావరిఖని బస్టాండ్, రామగుండం, పెద్దపల్లి రైల్వేస్టేషన్ కీలకంగా మారాయి. దీంతో ఈప్రాంతాలపై సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
నేరాల నియంత్రణే లక్ష్యం
నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకు సాగుతోంది. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి సారించాం. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు నార్కొటిక్ డాగ్స్‌ను రంగంలోకి దింపి తనిఖీలు చేపట్టాం. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి.
– మడత రమేశ్, ఏసీపీ, గోదావరిఖని


