● ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి ● గ్రామంలో విషాధచాయలు
రాయికల్: మరో వారంలో ఆ యువకుడు దుబాయ్ వెళ్లాల్సి ఉంది. అంతలోనే విధి అతడిని వెక్కిరించింది. ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాయికల్ మండలం కొత్తపేట ఒడ్డెరకాలనీకి చెందిన ఆలకుంట మహేశ్ (20) ఉపాధి నిమిత్తం కొద్దిరోజులుగా గల్ఫ్ వెళ్లి వస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నాడు. మరో వారం రోజుల్లో దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మంగళవారం ట్రాక్టర్‌లో ఇసుక నింపుకొని ఓ గ్రామంలోని ఇంటి వద్ద డంప్ చేసి తిరిగి వస్తున్నాడు. ఇటిక్యాల భూపతిపూర్–కొత్తపేట క్రాస్ రోడ్ వద్ద బండరాయికి ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహేశ్ ట్రాక్టర్ టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మహేశ్ మృతిచెందాడనే విషయం తెలియడంతో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. మహేశ్‌కు తండ్రి పోశయ్య, తల్లి లక్ష్మీ ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


