2007లో నా మొదటి కవిత్వ పుస్తకం వాకిలిని మలయశ్రీకి అందించాను. దాన్ని చదివిన తర్వాత ఆయన నాకు ఉత్తరం రాశారు. తెలంగాణ రచయితల వేదిక సభలలో, అనేక సమావేశాల్లో వారిని కలిసేవాళ్లం. వారి ఇంటికి వెళ్లి కలిసినప్పుడు వారు అనువాదం చేస్తున్న దమ్మపదం పద్యాలను చూపించారు. అనేకమార్లు భౌతికవాది పత్రికలను అందించారు. సాహిత్యంలో, జీవితంలోనూ నిర్మోహమాట భావ ప్రకటన, సూటిదనం ఉన్న వ్యక్తి.
– బూర్ల వెంకటేశ్వర్లు, కవి, రచయిత, కరీంనగర్
విలక్షణ సాహితీవేత్త
మలయశ్రీ బహు ప్రక్రియలలో రచనలు చేసి, బహు గ్రంథాలను వెలువరించిన అరుదైన, విలక్షణ సాహితీవేత్త. సామాజిక చైతన్యమే ధ్యేయంగా శాసీ్త్రయ దృక్పథంతో రచనలు చేసిన హేతువాది. తరతరాలుగా సమాజంలో నాటుకొని పోయిన మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలను తెగనాడుతూ రచనలు చేశారు. సమాజంలో సాహితీ కళారంగాల్లో ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించారు. మలయశ్రీ రచనలు మానవీయ సమాజాన్ని నిర్మాణం చేయడానికి దోహదం చేస్తాయి.
– కూకట్ల తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,
తెలంగాణ రచయితల వేదిక
కచ్చితత్వం ఆయన జీవన విధానం
మలయశ్రీ కరీంనగర్ జిల్లా సాహిత్య ప్రపంచంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన రాసింది కేవలం కవిత్వమే కాదు.. ఆయన చేసిన విస్తృత సాహిత్య ప్రయాణంలో కరీంనగర్ చరిత్ర, భాష, సాహిత్య చరిత్ర, సామాజిక చైతన్యం అన్నీ కలగలిసిపోయాయి. నిర్మోహమాటం, సూటిదనం, కచ్చితత్వం ఆయన జీవన విధానం. అధ్యాపకుడిగా, గురువుగా ఉన్నారు కానీ సాహిత్య రంగంలో గురుస్థానాన్ని ఆశించలేదు.
– వారాల ఆనంద్, సాహితీవేత్త, కరీంనగర్
గొప్ప రచయిత
మలయశ్రీ విశిష్టమైన రచయిత, నవలాకారుడు, కవి, అనువాదకుడు. తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన మహనీయుడు. శతాధిక గ్రంథకర్త జీవితమంతా సాహిత్యానికి ధారపోసిండు. బౌద్ధ తాత్వికత నాస్తిక హేతువాద ధృక్పథాన్ని జీవితంలో ఆచరించిన వ్యక్తి. ఆయనతో నాకు మూడు దశాబ్దాల అనుబంధం. ఆయన పేరున నెలకొల్పిన మలయశ్రీ అవార్డు 2006లో అందుకోవడం నాకు ఒక గొప్ప జ్ఞాపకం.
– అన్నవరం దేవేందర్,
కవి, రచయిత, రాష్ట్ర ప్రభుత్వ
దాశరధి పురస్కార గ్రహీత


