కోల్‌సిటీ(రామగుండం): వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేసే అతడొక సాధారణ వాచ్‌మన్.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా మరొకరి జీవితంలో వెలుగులు నింపాడు. మానవత్వానికి అద్దం పట్టే ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హృదయాలను కదిలించింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నైట్ వాచ్‌మన్ ఇందారపు రాయపోశం(60) కాకతీయ నగర్‌నివాసి. భార్య సమ్మక్క, ఇద్దరు కుమారులు ప్రశాంత్–పద్మ, కుమారస్వామి–జ్యోతి, కూతురు సత్యవతి–శ్రీనివాస్‌తోపాటు మనవలు, మనవరాళ్లు ఉన్నారు.
ప్రమాదం.. విషాదాంతం..
ఈనెల 10న రాత్రి విధులకు హాజరైన రాయపోశం.. తోటిఉద్యోగితో కలిసి గోదావరిఖని బస్టాండ్ సమీపంలో టీ తాగి తాగడానికి బైక్‌పై వెళ్తుండగా టీ జంక్షన్ వద్ద కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
విషాదంలోనూ మానవత్వం
రాయపోశం చిన్నప్పుడే ఒకకంటి చూపు కోల్పోయాడు. అయినా విధి నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కకన్ను కూడా దానం చేసి మరొకరికి చూపునివ్వాలని అంగీకరించారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధుల సూచనతో, ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్‌నాయక్ సహకారంతో శనివారం కార్నియా సేకరించి హైదరాబాద్‌కు తరలించారు.
నివాళి
రాయపోశం పార్థివదేహానికి జీజీహెచ్ మార్చురీ వద్ద బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్, కార్మిక సంఘాల ప్రతినిధులు నివాళి అర్పించారు. దహన సంస్కారాల కోసం మున్సిపల్ అధికారులు రూ.20 వేలు అందించారు.
మేయర్ అభినందన
విషాదంలోనూ మానవత్వాన్ని చాటిన రాయపోశం కుటుంబాన్ని మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, ఎసాబ్లిష్‌మ్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు అభినందించారు. ఆయన అకాల మరణంపై సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు.
చనిపోయాక కూడా ఒంటికన్ను దానం
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాచ్‌మన్ కుటుంబ సభ్యుల దాతృత్వం


