సిరిసిల్ల: సిరిసిల్ల నేతకళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతాన్ని మగ్గంపై ఆవిష్కరించారు. రెండు గ్రాముల బంగారం, వెండి పోగులతో చీరను నేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు.. రెండు గ్రాముల బంగారం, మరో రెండు గ్రాముల వెండిని ఉపయోగించి బంగారు, వెండి పోగులతో ఆకర్షణీయమైన చీరను రూపొందించారు. సుమారు 25 రోజులపాటు శ్రమించి, ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో తీర్చిదిద్దారు. బంగారు, వెండి పోగు తీగలతో నేసిన ఈ చీరను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు హైదరాబాద్‌లో శనివారం ఆవిష్కరించారు. రూ.85వేల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చీర మంత్రముగ్ధులను చేస్తోందని, సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందుతోందని కేటీఆర్ అభినందించారు. అగ్గిపెట్టెలో ఇమిడేచీరను నేసి ప్రపంచానికి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడే నల్ల విజయ్. తండ్రి చేనేత వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కళాకండాలను ఆవిష్కరిస్తున్నారు. తాను నేసిన బంగారం, వెండిపోగుల చీరను కేటీఆర్ ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని నల్ల విజయ్ అన్నారు. భవిష్యత్‌లోనూ మరిన్ని వినూత్న ప్రయోగాలు చేస్తానని స్పష్టం చేశారు.
సిరిసిల్ల నేతకళాకారుడి అద్భుత సృష్టి
అభినందించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


