8 గంటలు.. 40 కిలోమీటర్లు | - | Sakshi
Sakshi News home page

8 గంటలు.. 40 కిలోమీటర్లు

Mar 13 2026 8:58 AM | Updated on Mar 13 2026 8:58 AM

● అంజన్న ఆశీర్వాద యాత్రకు కేంద్రమంత్రి ‘బండి’ ప్రణాళిక ● 14న ఉదయం 7గంటలకు మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభం

● అంజన్న ఆశీర్వాద యాత్రకు కేంద్రమంత్రి ‘బండి’ ప్రణాళిక ● 14న ఉదయం 7గంటలకు మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో శనివారం 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ మేర వేడి ఉండబోతున్నట్లు వాతావరణశాఖ చెబుతున్నప్పటికీ 8గంటల్లో 40కిలోమీటర్లు నడిచి కొండగట్టుకు చేరేందుకు సిద్ధమయ్యారు. పాదయాత్ర పొడవునా మంచి నీళ్లు, మజ్జిగ, పులిహోర సహా అన్ని ఏర్పాట్లు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, భక్త మండళ్లు ముందుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కరీంనగర్‌ బాట పడుతున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు గురువారం సాయంత్రం బీజేపీ శ్రేణులు నగరంలో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల ఇన్‌చార్జి బండారి శాంతికుమార్‌, మోహన్‌రెడ్డి, జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌ కుమార్‌ పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో, కొండగట్టు వద్ద ఏర్పాట్లు పరిశీలించారు.

పది పరీక్షలకు ఇబ్బంది లేకుండా

శనివారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాదయాత్ర సందర్భంగా విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడకుండా, రోడ్డుపై ట్రాఫిక్‌ జాం కాకుండా యాత్రను సాగించాలని బండి సంజయ్‌ కాషాయ శ్రేణులను కోరారు. పాదయాత్రలో పాల్గొనే వారంతా ఈ14న ఉదయం 6 గంటలకే మహాశక్తి ఆలయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.

పాదయాత్ర సాగుతుందిలా..

14న ఉదయం 6 గంటలకు కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయానికి బండి సంజయ్‌ చేరుకుంటారు. కార్యకర్తలతో కలిసి కొండగట్టుకు బయల్దేరుతారు. రామడుగు, వెదిర, కురిక్యాల మీదుగా గంగాధర చేరుకుంటారు. అక్కడి వీఏఎస్‌ ఫంక్షన్‌ హాలులో భోజనం చేస్తారు. వెంకటాయపల్లి, పూ డూరు, దొంగలమర్రి, మీదుగా కొండగట్టు ఘాట్‌ రోడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అంజన్న ఆలయం వద్దకు వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement